అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియవాడి'. ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రధాన కథానాయకులు ఇందులో నటించనున్నారు. అయితే, కరోనా వైరస్ కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలో షూటింగ్ చేసుకోవడానికి రాష్ట ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది.
ఈ క్రమంలోనే జులై నెలలో సినిమాను తిరిగి ప్రారంభించడానికి చిత్ర నిర్మాణ సంస్థ సన్నద్ధమైంది. ఇందులో గ్యాంగ్‌స్టర్ కరీం లాలా పాత్రలో అజయ్ దేవగణ్ నటించనున్నాడు. ఇక మరో పాత్రలో ఎమ్రాన్ హస్మీ నటించనున్నాడని సమాచారం. సినిమాకు ఈ రెండు పాత్రలు చాలా ముఖ్యమైనవి. గంగూబాయిలో అలియా భట్ వేశ్య గృహం నడిపే యజమానిగా నటించనుంది. ఇటీవలే ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇరువురి కలయికలో..
అజయ్ దేవగణ్ - ఎమ్రాన్ హస్మీలు కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వీరిద్దరు 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై' చిత్రంలో కనిపించారు. గుంగూబాయి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా కాకుండా సాధ్యమైనంత వరకు థియేటర్లోలోనే విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తొందట. మరోవైపు అలియా భట్, అజయ్ దేవగణ్‌లు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్‌ఆర్' చిత్రంలోనూ నటిస్తున్నారు.