థియేటర్లు తెరుచుకోవడం.. కీలకమైన సంక్రాంతి, వేసవి సీజన్లు దగ్గర పడుతుండడం వల్ల సినీ బృందాలు వేగం పెంచాయి. చివరి దశకు చేరుకున్న తమ చిత్రాల్ని పూర్తి చేసుకోవడంపై దృష్టి పెడుతున్నారు దర్శకనిర్మాతలు. కథానాయకులు కూడా కరోనా విరామంలో బోలెడన్ని కథలు విని, కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేశారు. అవన్నీ పూర్తి చేయాలంటే ఇప్పుడు వేగం పెంచాల్సిందే. కొవిడ్ జాగ్రత్తల్ని పాటిస్తూ చిత్రీకరణల్లో పాల్గొనడంపైనా ఆ బృందాలు రాటుదేలాయి. దాంతో మునుపటిలా మళ్లీ చిత్రీకరణల జోరు కనిపిస్తోంది. ఇలా పరిశ్రమంతా ఒక్కసారిగా రంగంలోకి దిగడంతో క్లాప్ చప్పుళ్లు బలంగా వినిపిస్తున్నాయి.
నగరంలోనే..
కరోనా తర్వాత ఔట్ డోర్‌లో చిత్రీకరణలు చేయడానికి మొగ్గు చూపడం లేదు సినిమా బృందాలు. ప్రయాణాలు చేయాల్సి రావడం.. అక్కడ వసతులు, వాతావరణంపై భయాలతో స్థానికంగా చిత్రీకరణలు చేసుకోవడమే మేలని భావిస్తున్నాయి. అందుకే కాస్త ఎక్కువ ఖర్చయినా ఇక్కడే సెట్స్‌ని తీర్చిదిద్ది చిత్రీకరణ చేస్తున్నారు.
- ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' కోసం రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు, నగరంలోని మరో స్టూడియోలో సెట్స్ వేశారు. యూరప్ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ వేసి, అందులోనే చిత్రీకరణ చేస్తున్నారు. జనవరి తొలి వారం వరకు 'రాధేశ్యామ్' చిత్రీకరణ భాగ్యనగరంలోనే జరుగుతుందని సినీ వర్గాలు తెలిపాయి.ప్రభాస్
- చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఆచార్య' కోసం ఓ ఊరు ముస్తాబైంది. హైదరాబాద్ నగర శివార్లలో వేసిన ప్రత్యేకమైన ఆ సెట్‌లోనే మరికొన్నాళ్లపాటు షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే చిరంజీవి, కాజల్‌లపై ఓ పాటని తెరకెక్కించారు. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'వకీల్‌సాబ్' హైదరాబాద్‌లోనే జరుగుతోంది.చిరంజీవిపవన్కల్యాణ్
- అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' నగర శివార్లలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో చిత్రీకరణ జరుపుకొంటోంది.అల్లు అర్జున్
- అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', గోపీచంద్ 'గోలీమార్', నాగశౌర్య 'వరుడు కావలెను'తోపాటు మరికొన్ని సినిమాల చిత్రీకరణలు నగరంలోనే సాగుతున్నాయి.
పొరుగు నుంచి..
తమిళనాట కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి స్టార్లంతా షూటింగ్‌ల కోసం భాగ్యనగరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. సకల సౌకర్యాలున్న ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీకి తమిళం, హిందీ, కన్నడ భాషల నుంచి తారల సినిమాలు తరలివస్తున్నాయి. చిత్రీకరణలకి అనువైన విశాల వాతావరణం, శరవేగంగా జరిగే ఏర్పాట్లు ఉండటం వల్ల ఆయా బృందాలు తొలి ప్రాధాన్యం ఫిల్మ్‌సిటీకి ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడే రజనీకాంత్ 'అన్నాత్తే' చిత్రీకరణ జరుగుతోంది. ఊరిని తలపించే ఓ పెద్ద సెట్‌ని తీర్చిదిద్ది అక్కడే చిత్రీకరణ చేస్తున్నారు. హిందీ నుంచి అజయ్ దేవగణ్ కూడా వచ్చారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'మేడే' చిత్రీకరణ ఇక్కడే జరుగుతోంది. శుక్రవారం అజయ్ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటారు.

- హైదరాబాద్‌లోనే తమిళ తారలు అజిత్, సూర్య, కార్తి ఇటీవలే సినిమాల చిత్రీకరణలు పూర్తి చేసుకుని వెళ్లారు. త్వరలోనే ధనుష్ నగరానికి రానున్నారు. కన్నడ నటుడు యశ్ నటిస్తున్న 'కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2' చిత్రీకరణ రెండు వారాలుగా హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
- ఇలా సినిమాలన్నీ సెట్స్‌పై ఉన్నా పరిశ్రమలోని కార్మికులకి అరకొరగానే ఉపాధి లభిస్తోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వల్ల పరిమిత సంఖ్యలోనే సభ్యులు సెట్లో ఉండాల్సి రావడం వల్ల ఇంకా పూర్తిస్థాయిలో ఉపాధి దొరకడం లేదని కార్మికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:నటనకు కంచుకోట.. విన్నకోట రామన్న పంతులు