శనివారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
మోడలింగ్ అంటే ఇష్టం..
"చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒక రంగంలో స్థిరపడాలని, అందులో పేరు తెచ్చుకోవాలనే ఆశ ఎక్కువగా ఉండేది. టీనేజీలో ఉన్నప్పుడు మోడలింగ్‌లోకి వెళ్లాలనిపించింది. వెంటనే ఆ విషయాన్ని నాన్నతో చెప్పా. ఆయన ఏం అనలేదు. ఆ తర్వాత నన్ను బెంగళూరులోని ఓ ప్రముఖ మోడలింగ్ శిక్షణ కళాశాలలో చేర్పించారు. అనంతరం అందులోనే ఎన్నో విషయాలు నేర్చుకుని పలు పోటీల్లో పాల్గొన్నా."
ఎన్నోసార్లు బాధపడ్డా..!
"మా కళాశాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు మోడలింగ్ చేసేవాళ్లు. వాళ్లని చూసి నాక్కూడా వెళ్లాలనిపించేది. ఓసారి అలాగే మోడలింగ్ పోటీలకు వెళితే.. 'నువ్వు ఏం అంత అందంగా ఉన్నావ్? కేవలం సన్నగా నాజూకుగా ఉన్నావు తప్ప పెద్ద అందచందాలేవీ నీకు లేవు' అని కామెంట్లు చేశారు. ఆ మాటలకు నేను ఎంతో బాధపడ్డా"
అవకాశం చూసి.. వచ్చేశా
"మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూశా. ఏదైనా మంచి సినిమాలో అవకాశం వస్తే వదులుకోకూడదు అనుకున్నా. అలాంటి సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నుంచి 'రబ్ దే బనాది జోడీ' అవకాశం లభించింది. అందులో షారుఖ్‌కు జోడీగా నటించా."
కలలన్నీ చెదిరిపోయాయి.. కానీ..
"రబ్ దే బనాది జోడీ' తర్వాత అవకాశాలు వరుస కడతాయని భావించా. కానీ నా కలలన్నీ తారుమారయ్యాయి. ఆ సినిమా అంతగా ఆడలేదు. నాకు అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డైనా దక్కుతుందని భావించా. ఆ అవార్డుల ప్రదానోత్సవానికి కూడా వెళ్లా. తీరా అక్కడికి వెళ్లాక నాకు అవార్డు రాలేదు. కన్నీళ్లు ఆగలేదు. స్టేజ్ వెనక్కి వెళ్లి ఏడుస్తుంటే అమితాబ్ బచ్చన్ వెనుక నుంచి వచ్చి.. ''రబ్ దే బనాది జోడీ' సినిమా చూశా. అందులో మీ నటన చాలా బాగుంది' అని చెప్పారు. ఆ మాట నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది."
చివరి షాట్ అనుకున్నా..
"నా మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ రెండో సినిమా విడుదలయ్యాక నాకు కొంచెం ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. అదే సమయంలో ఓ నిర్మాత నాకు ఫోన్ చేసి.. 'నువ్వు బాగా నటించగలవు. కానీ, ఓ మోస్తరుగా చేస్తున్నావు. కాబట్టి ఇకపై కెమెరా ముందు నిల్చున్న ప్రతిసారీ ఇది నీ చివరి షాట్ అనుకో' అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత నాకు 'బ్యాండ్ బాజా బారాత్'లో అవకాశం వచ్చింది. హీరో రణ్‌వీర్‌సింగ్. నిర్మాత సలహా పాటించి నా వంతు కృషి చేశా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్."
నిర్మాతగా మారాల్సి వచ్చింది
"హీరోయిన్‌గా నేను అన్నిరకాల కథల్లో నటించలేకపోవచ్చు. ఎందుకంటే నా వద్దకు వచ్చిన ఆఫర్స్‌లోనే నేను భాగం కాగలను. అదే నిర్మాతగా అయితే నాకు నచ్చిన సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంటుంది. అందుకే సోదరుడితో కలిసి క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ వేదికగా పలు విభిన్న కథా చిత్రాలు నిర్మించా."
ఖాళీ సమయం..
"విరాట్ నేనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వివాహం తర్వాత మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు వృత్తిపరమైన బాధ్యతలు ఓ వైపు చూసుకుంటూనే మరోవైపు గృహిణిగా నా భర్త కోహ్లీకి సంబంధించిన పనులు కూడా చేస్తున్నా. దానివల్ల నాకు ఖాళీ సమయం దొరకడం లేదు. ఒకవేళ ఎప్పుడైనా తీరిక దొరికితే కోహ్లీతో కలిసి టీవీ చూడడానికి ఆసక్తి చూపిస్తా"
విరాట్‌ను కోప్పడ్డా..
"ఆత్మాభిమానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటా. ఏ దుస్తులు వేసుకోవాలి? ఎలాంటి పోజులివ్వాలి? ఇవన్నీ పూర్తిగా నా వ్యక్తిగతం. ఈ విషయాల్లో అమ్మానాన్నలే కాదు విరాట్ కలుగజేసుకున్నా నేను ఊరుకోను. ఓసారి విరాట్ ఏదో జోక్యం చేసుకోబోతే.. నా విషయంలో మాట్లాడవద్దు అని స్పష్టంగా చెప్పేశా. మొదట తనకి కోపం వచ్చింది. కానీ నా గురించి ఆలోచించి నా కోపాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నా విషయాల్లో తను ఎలాంటి జోక్యం చేసుకోడు"
ఆయన టీషర్ట్సే వేసుకుంటా..!
"ఫ్యాషన్ విషయంలో నేను ట్రెండ్ ఫాలో అవుతుంటానని అందరూ అనుకుంటారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. నేను కేవలం సంప్రదాయానికే ఓటు వేస్తా. అలాగే రంగుల విషయంలో కూడా తరచూ వాడే వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటా. చిట్టిపొట్టి దుస్తులు ధరించి కనపించడం వల్ల అందరూ నేనేదో ట్రెండ్ ఫాలో అవుతుంటాను అనుకుంటున్నారు. ఆ డ్రెస్సులన్నీ విరాట్‌వే. ఎందుకంటే నేను ఎక్కువగా విరాట్ టీ షర్టులనే ధరిస్తుంటా. నేను అలా వేసుకోవడం ఆయనికీ ఇష్టమే."
ఇదీ చూడండి: 'విరుష్క' వివాహ బంధానికి మూడేళ్లు.. జంట భావోద్వేగం