ప్రతినాయకి పాత్రలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు... కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడటం నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నైజం. 'వరూ' అంటూ కుటుంబ సభ్యులే కాదు అభిమానులూ ఇష్టంగా పిలిచే వరలక్ష్మి త్వరలో 'క్రాక్'లో మెరవనుంది. మరి ఆమె ఇష్టాయిష్టాలూ, ఆలోచనలూ తెలుసుకుందామా!
ఆంటీ స్టైల్ నచ్చుతుంది
నా దృష్టిలో అమ్మ అంటే ఒకరే. అందుకే రాధికా ఆంటీని అమ్మా అని పిలవను. అయితే మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ఆంటీ ఫ్యాషన్‌పైన పెట్టే శ్రద్ధ, కట్టుకునే చీరలూ వాటికి మ్యాచ్ అయ్యేలా పెట్టుకునే నగల్ని చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది.
ప్రభాస్ నటనకు ఫిదా
నేను తెలుగు సినిమాలూ చూస్తుంటాను. తెలుగు హీరోల్లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి తమిళంలో విడుదలైనా తెలుగులోనే చూశాను. ప్రభాస్‌తో కనీసం ఒక్క సినిమా చేయాలనేది నా కల. చూడాలి అది నెరవేరుతుందో లేదో...
వీధి కుక్కల కోసం కాస్త సమయం
కొన్నాళ్ల క్రితం సమాజానికి నా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతో 'సేవ్‌శక్తి' పేరుతో ఓ సంస్థను ప్రారంభించాం. ఇందులో మా అమ్మ కూడా భాగమే. మా సంస్థ కార్యక్రమాల్లో భాగంగా కొవిడ్ సమయంలో వెయ్యి వీధికుక్కలకు యాంటీరేబిస్ టీకాలు వేయించాం. నాకు సమయం ఉన్నప్పుడల్లా పెడిగ్రీ, రాయల్ కెనిన్ లాంటి సంస్థల సహకారంతో వాటి కోసం ఏదో ఒకటి చేసేందుకు చూస్తుంటా.
నటి కాకపోయుంటే డాన్సర్
ఒకవేళ నాకు సినిమా అవకాశాలు రాకపోతే డాన్సర్‌గా స్థిరపడాలనుకున్నా. దానికి తగినట్లుగా ఓ వైపు మైక్రోబయాలజీలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తూ మరోవైపు భరతనాట్యం, జాజ్, హిప్‌హాప్... అంటూ చాలా నేర్చుకున్నా. అయితే అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు నాకు నటనపైన ఇష్టం పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు చేశా. అవన్నీ నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి.
సరదాగా బేకింగ్ వ్యాపారం
ఓసారి నా ఫ్రెండ్‌తో కలిసి ఓ మాల్‌కు వెళ్తే చీజ్‌టార్ట్స్ చేస్తున్న వాసన వచ్చింది. దాన్ని తిన్నాక నేనూ అలాంటి రుచికోసం ఇంట్లో ప్రయోగాలు చేశా. చివరకు ఈ ఏడాది జూన్‌లో ఓ హాబీలా 'లైఫ్ ఆఫ్ పై' పేరుతో చిన్న బేకింగ్ కంపెనీని ప్రారంభించి వాటిని తయారుచేస్తున్నా. ఇది స్టార్టప్ కాబట్టి బేకింగ్ నుంచి ఆర్డర్లు ప్యాక్ చేయడం వరకూ అన్నీ నేనే చేస్తున్నా. ఆర్డర్లు బాగానే వస్తున్నాయి.
అమ్మే నా బలం
చాలామంది 'నువ్వు అంత ధైర్యంగా ఎలా మాట్లాడతావు' అంటూంటారు. దానికి స్ఫూర్తి మా అమ్మ ఛాయానే. చిన్నతనం నుంచీ అమ్మ మాకోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎలాంటి సమస్య ఎదురైనా ఒంటరిగా పోరాడింది. ఇప్పటికీ ఉత్సాహంగానే ఉంటుంది. నేను అమ్మలో సగం అయినా ఉంటే చాలనుకుంటా.
బాయ్స్‌లో ఛాన్స్
నాకు కొన్నేళ్ల క్రితమే శంకర్ సర్ తీసిన 'బాయ్స్', తెలుగులో వచ్చిన 'ప్రేమిస్తే' సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. బాయ్స్‌కు అయితే స్క్రీన్‌టెస్ట్ చేసి, నన్ను హీరోయిన్లలో ఒకరిగా ఎంపిక చేశారు. కానీ చివరి నిమిషంలో నాన్న వద్దనడం వల్ల ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నా.
గొంతే నా బలం
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నా మాటతీరు చూసి.. అబ్బాయి గొంతులా ఉందని చాలామంది విమర్శించారు. అయితే... ఇప్పుడు ఆ మాటతీరే నా ప్లస్‌పాయింట్ అయ్యింది. నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరుకున్నా.
రాజకీయాల్లోకి రావాలని
ఇప్పటిదాకా నాకు తోచిన సేవా కార్యక్రమాలు చేస్తున్నా కానీ... భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని ఉంది. అప్పుడైతే ఇంకా ఎక్కువ మందికి సాయం చేయొచ్చని అనుకుంటున్నా.