సినిమాల్లో మంచి నటిగా నిరూపించుకోవాలంటే ఒకే తరహా పాత్రలు చేస్తే కష్టం. నటన, అభినయంతో పాటు కాస్త అందం ఒలకబోస్తేనే... ఈ కాలంలో నటీమణులు ఎక్కువ రోజులు చిత్రసీమలో నిలదొక్కుకొనే పరిస్థితి ఏర్పడింది. అందుకే హీరోయిన్లు తమ పాత పద్ధతులకు చెక్ పెట్టి గ్లామర్ రోల్స్ పోషించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి ప్రముఖ నటి స్మితా తంబే చేరారు.
2006లో సినీరంగంలో అడుగుపెట్టిన ఈమె... అక్షయ్ తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన '72 మైల్స్-ఏక్ పర్వాస్' చిత్రంతో నటిగా తనదైన ముద్ర వేసుకుంది. 'రుక్' చిత్రంలో మనోజ్ భాజపేయీ, 'నూర్' చిత్రంలో సోనాక్షితో తెర పంచుకుంది. అంతేకాకుండా జోగ్వా, అజ్జీ, డబుల్ గేమ్స్, ఉమ్రికా, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 'సింగమ్ రిటర్న్ చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పటివరకు నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే కనువిందు చేసిన 36 ఏళ్ల ఈ భామ... ప్రస్తుతం వస్తోన్న ఆఫర్లకు అనుగుణంగా గ్లామర్ ఒలకబోసేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే తొలిసారి పొట్టి బట్టల్లో ఫొటోషూట్లో పాల్గొంది.
" ఇన్ని సంవత్సరాలు తెరపై మంచి పాత్రలు చేశాను. ఈ పదేళ్ల నా కెరీర్లో తొలిసారి గ్లామర్ పాత్రల్లో అవకాశాలు వస్తున్నాయి. నేను ఈ రోల్లో ఎలా ఉంటానో చూసుకోవాలనుంది. తర్వాతి చిత్రాల్లో ఇవే పాత్రలు పోషించనున్నాను. అందం కలబోసిన సినిమాల్లో నటించాలని నా అభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. అందుకే వాటి కోసమే ఈ షూట్లో పాల్గొన్నాను".
-- స్మితా తంబే, నటి
2019 సంవత్సరం వృత్తి పరంగా, వ్యక్తిగతంగా స్మితాకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సహ నటుడైన విరేంద్ర ద్వివేదితో ఆమెకు పెళ్లయింది. నిర్మాతగా 'సావత్' అనే చిత్రం తెరకెక్కించింది. ప్రస్తుతం 'ఇడియట్స్' పేరుతో ప్రసారమవుతున్న మరాఠీ సీరియల్లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం ఆమెకు బుల్లితెరపైనా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు 'సేక్రెడ్ గేమ్స్2', 'హవా బద్లే హస్సు' వంటి వెబ్ సిరీస్లలో కీలక పాత్రల్లో నటిస్తోంది.