ఆమె పేరు చెప్పగానే అభిమానుల గుండెలు బరువెక్కుతాయి. కన్నీటితో కళ్లు తడిసిపోతాయి. ఆమె అందం.. అభినయం... నృత్య సమ్మోహనాన్ని మించిన వ్యక్తిగత జీవితమే వీక్షకులను ఎంతగానో కలచివేస్తుంది. గ్లామర్ ప్రపంచంలో తన ముద్రతో విజయం సాధించినా .. తన పేరులోని విజయం మాత్రం జీవితంలో చవిచూడలేకపోయింది. తళుకుబెళుకుల రంగుల ప్రపంచంలో అమాయకమైన చిరునవ్వు మిగిల్చి తనని తాను అంతం చేసుకుని ఎన్నటికీ తిరిగిరాని దూర తీరాలకు తరలిపోయింది. తెరపై కనిపించేదంతా అబద్దమని.. తన చావు మాత్రమే నిజమనే సంకేతాన్నిచ్చి జీవితాన్ని విషాదాంతం చేసుకుంది.
వ్యక్తిగతం
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. 1960 డిసెంబర్ 2న జన్మించింది. 1996 సెప్టెంబర్ 23న తుదిశ్వాస విడిచింది. ఈ రెండు తేదీల మధ్య జీవితంలో కొంత భాగం వెండి తెరకు అంకితం చేసింది. ఏమాత్రం మోహమాటం లేకుండా నర్తించి, నటించి, ఒళ్లు దాచుకోకుండా కనిపించి, కవ్వించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేందుకు తనవంతుగా కృషి చేసింది.
సిల్క్ స్మిత పేరు వచ్చిందిలా!
సిల్క్ స్మిత ప్రధానంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. మొదట సహాయ నటి పాత్రలు పోషించింది. 1979లో 'వండి చక్రం' అనే తమిళ సినిమాలో 'సిల్క్' అనే పాత్రతో తొలిసారి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆ పేరునే తన స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది. 17 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 450 సినిమాల్లో నటించింది.
కుటుంబ నేపథ్యం
రామల్లు, సరసమ్మ దంపతులకు ఏలూరులో సిల్క్ స్మిత జన్మించింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పది సంవత్సరాల వయసులో నాలుగో తరగతితో విద్యకు స్వస్తి చెప్పింది. ఆమె రూపం ఎంతోమంది దృష్టిని ఆకర్షించేది. దాంతో, ఆమె చాలా ఇబ్బంది పడేవారు. చాలా చిన్న వయస్సులోనే స్మితకు వివాహం చేసేశారు ఆమె తల్లిదండ్రులు. భర్త, అత్తామామలు స్మితను వేధింపులకు గురి చేశారు. దాంతో, ఇంటి నుంచి స్మిత పారిపోయింది.
టచప్ ఆర్టిస్ట్ నుంచి టాప్ లెవెల్‌కు
స్మిత.. టచ్ అప్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఏవీఎమ్ స్టూడియో సమీపంలో ఫ్లోర్ మిల్ డైరెక్టర్‌గా పనిచేసే విను చక్రవర్తి.. ఆమె పేరును 'స్మిత'గా మార్చారు. అతని సంరక్షణలో స్మిత ఉండేది. విను చక్రవర్తి భార్య స్మితకు ఇంగ్లీష్ నేర్పించారు. డాన్స్ నేర్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు. తన సెక్స్ అప్పీల్ కారణంగా నైట్ క్లబ్బుల్లో, రెస్టారెంట్లలో వ్యాంప్ పాత్రల్లోనే స్మిత ఎక్కువగా నటించారు.
నర్తకి కాదు నటిగానూ గుర్తింపు
స్మిత కేవలం డాన్సర్‌గానే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించింది. నాన్ సెక్సువల్ పాత్రలతోనూ విమర్శకులను మెప్పించింది. ఇండియన్ అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్మిత నటించిన 'లయనం' అనే మలయాళ సినిమా కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకొంది. బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన 'వసంత కోకిల'.. స్మిత కెరీర్ లో అత్యంత గౌరవనీయమైన చిత్రంగా నిలిచింది. ఇందులో శ్రీదేవి, కమల్ హాసన్ వంటి అగ్ర తారలతో స్మిత స్క్రీన్ షేర్ చేసుకొంది.
ఏకాకి జీవితం
సిల్క్ స్మితకు చాలా తక్కువ మందే స్నేహితులు. తాను ఎక్కువగా మాట్లాడేది కాదు, ఎవరితోనూ అంత తొందరగా స్నేహం చేసేది కాదు. స్నేహితులు, అభిమానులు స్మితది చిన్న పిల్లల మనస్తత్వమని, మృదు స్వభావి అని అంటారు. అయితే తనువు చాలించే వరకు ఎవరిని వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది స్మిత.
జీవితం విషాదాంతం
1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన ఇంట్లోనే మరణించింది. ఈ విషయం ఆమె అభిమానుల్ని ఎంతో కలవరపెట్టింది. ఇప్పటికీ స్మిత మరణం వెనుక ఉన్న కారణం ఓ మిస్టరీగానే మిగిలింది. ఆమె చావుపై ఎన్నో పుకార్లు వచ్చాయి. అయితే పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం స్మిత.. తన చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొందంటూ రిపోర్ట్ వచ్చింది.
స్మిత జీవితంపై సినిమా
2011లో బాలీవుడ్లో స్మిత జీవితం ఆధారంగా 'ద డర్టీ పిక్చర్' అనే సినిమా వచ్చింది. విద్యాబాలన్ స్మిత పాత్రలో నటించింది. ఇందులో నటనకుగాను ఆమె జాతీయ అవార్డు అందుకుంది.