"అప్పుడప్పుడూ కొన్ని భయాలు నాలోని నటిని మరింత మెరుగుపెడుతుంటాయి" అని చెబుతోంది ప్రముఖ హీరోయిన్ సమంత. పెళ్లి తర్వాత నటిగా విభిన్న పాత్రలతో మెప్పిస్తూ దూసుకెళ్తోన్న ఈ అక్కినేని కోడలు.. త్వరలో ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో 'నటిగా ఇన్నేళ్ల కెరీర్‌లో వదులుకోలేక పోయిన భయాలు ఏమైనా ఉన్నాయా?' అని ప్రశ్నించగా.. ఉన్నాయని బదులిచ్చింది. ఈ భయమంటే తనకెంతో ఇష్టమని చెప్పింది.
"నేను భయాన్ని ఇష్టపడటానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రస్తుతం నేను సవాల్‌తో కూడిన పాత్రలు చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అలాంటి పాత్ర నా దగ్గరకొచ్చినప్పుడు.. 'నేను చేయగలనా? లేదా?' అన్న భయం నాలో పుట్టాలి అనుకుంటా. ఎందుకంటే ఆ భయం ఉన్నప్పుడే ఇంకా జాగ్రత్తగా, మరింత శ్రద్ధతో ఆ పాత్రను చేస్తా. ఈ మధ్య నా నుంచి మంచి సినిమాలు, చక్కటి పాత్రలు వస్తున్నాయంటే కారణం ఈ భయమే" అని చెప్పుకొచ్చింది సామ్.
ప్రస్తుతం సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది.