డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేసినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించగా.. నేడు రకుల్‌ప్రీత్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.
"నిన్న రకుల్‌ప్రీత్‌కు సమన్లు జారీ చేశాం. ఆమెను సంప్రదించడానికి వివిధ సోషల్‌మీడియాల్లో ప్రయత్నించాం. కానీ, ఆమె స్పందించ లేదు. తాజాగా ఆమెనే సమన్లు అందినట్లు తెలిపింది."
- నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
గురువారం రకుల్‌ప్రీత్‌ను డ్రగ్స్ కేసు గురించి విచారించిన తర్వాత.. శుక్రవారం (ఈనెల 25న) దీపికా పదుకొణె, శనివారం (26న) సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ హాజరు కావాలని ఆదేశించారు. దీపిక తన తదుపరి చిత్ర షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం గోవాలో ఉన్నట్టు సమాచారం.
వాట్సాప్ చాటింగ్ ఆధారంగా సమన్లు
మాదక ద్రవ్యాల వినియోగం కేసులో దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో పాటు టాలెంట్ మేనేజర్ జయా సాహానూ ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్ గురించి జరిగిన చాటింగ్ వివరాలను అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు కొన్ని రోజుల పాటు విచారించి అరెస్టు చేశారు. రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు ఇప్పటివరకు డ్రగ్స్ కేసులో 15మందిని అదుపులోకి తీసుకున్నారు. రియాను విచారించిన సందర్భంలోనే సారా అలీఖాన్, రకుల్ పేర్లు బయటకు వచ్చాయి.