'ఆకాశమే నీ హద్దురా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మలయాళ తార అపర్ణా బాలమురళి. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ చిత్రంలో కథానాయకుడు సూర్యకు భార్య పాత్రలో నటించి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది అపర్ణ. 'తెలుగువారికి గుర్తుండిపోయేలా మంచిపాత్ర పోషించే అదృష్టం దక్కింది' నాకు అంటోందామె. ఆడిషన్స్‌కు వెళ్లే వరకు ఈ సినిమాలో హీరో సూర్య అని తెలీదని, ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కడం తనకు జాక్‌పాట్ కొట్టినట్లుందని చెబుతోంది. ఈ సందర్భంగా అపర్ణ జీవితంలోని కొన్ని విశేషాలతో పాటు సినిమా సంగతులను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
బుల్లితెరపై బాలనటిగా
బుల్లితెరపై బాలనటిగా నా నట ప్రస్థానం మొదలైంది. తర్వాత లఘుచిత్రాలు చేశా. అలా మలయాళంలో వెండితెరపై అవకాశం వచ్చింది. 15 సినిమాలు చేశా. 'ఆకాశమే నీ హద్దురా' సినిమాకు హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లా. అక్కడ దర్శకురాలు సుధాకొంగరా నాకు చిన్న సన్నివేశాన్నిచ్చి నటించాలన్నారు. చేసి చూపించా. అక్కడ పోస్టర్‌లో సూర్యను చూశా. అప్పటివరకు ఆయన ఈ సినిమాకు హీరో అని తెలీదు. సహజనటనకు మారుపేరుగా ఉండే ఆయన పక్కన అవకాశం దక్కుతుందో లేదో అనుకున్నా. ఆ యూనిట్ నుంచి నన్ను హీరోయిన్‌గా ఓకే చేసినట్లు కబురొచ్చినప్పుడు ఎగిరిగంతేశా.
మదురై యాస
ఈ చిత్రం ఇంత సహజసిద్ధంగా మనసుకు దగ్గరగా అనిపించడానికి కారణం సుధ. నటీనటులు, యూనిట్ అందరికీ ఏడాదిపాటు వర్క్‌షాపు నిర్వహించారామె. ఇందులో నాది ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్న మదురైకు చెందిన ఓ యువతి పాత్ర. అయితే భాష దగ్గర చిన్న సమస్య వచ్చింది. నాకు తమిళం వచ్చు. మదురై యాస అంతగా రాదు. ఏడాదిపాటు స్క్రిప్టు చదువుతూ, మాట్లాడుతూనే ఉన్నా.
నేనూ ఊహించ లేదు
ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఓ సన్నివేశంలో సూర్యకు, నాకు మధ్య వివాదం జరుగుతుంది. ఆ షాట్ ఎక్కువసేపు పడుతుందని అనుకున్నా. తీరా సెట్‌లోకి వచ్చేసరికి మొదటి టేక్‌కే సీన్ పక్కాగా రావడం నేనూహించలేదు.
ఇంట్లో సంగీతం
మా ఇంట్లో అమ్మ శోభ, నాన్న బాలమురళి ఇద్దరూ సంగీత కళాకారులే. నాకూ చిన్నప్పటి నుంచి నటనంటే ఆసక్తి. అందుకే బాలనటిగా నటనను మొదలుపెట్టా. మాది కేరళలో పాలక్కాడు. ఇటీవలే ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తిచేశా. తెలుగులో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.
సూర్య అంటే స్ఫూర్తి
సీనియర్ నటుడు సూర్యతో జోడీగా అంటే మొదట భయం అనిపించింది. తీరా వర్క్‌షాపులో మేమిద్దరం స్క్రిప్టును కలిపి చదివేవాళ్లం. ఆ సమయంలో తను చాలా సహకారం అందించారు. ఆయన సహనం చూస్తే ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారు. సహ నటులను ప్రోత్సహిస్తూ చేయూతనందించే మంచి మనిషి.