విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ అంటే... అదీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అయితే... ఆ కాంబినేషన్ మీద చాలా అంచనాలే ఉంటాయి. వాటిని అందుకునేలా, ప్రేక్షకులను మెప్పించేలా విజయ్ సినిమాలో తళుక్కున మెరవబోతోంది బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. టాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారిగా పలకరించబోతున్న అనన్య... ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాలూ అభిప్రాయాలూ చెబుతోందిలా...
నటిని కావాలనే ఆశ...
అమ్మ భావనా పాండే డిజైనర్, నాన్న చంకీ పాండే బాలీవుడ్‌లో పేరున్న నటుడు. నా చుట్టూ ఉన్న ప్రపంచమంతా సినిమాలే! మరి నాకు హీరోయిన్ కావాలనే ఆశ లేకుండా ఉంటుందా? చిన్నప్పటి నుంచీ నటిని కావాలనే కలలు కనేదాన్ని. టీనేజ్ నుంచే ఫొటోషూట్స్, ఆడిషన్స్ అంటూ తిరిగేదాన్ని. చాలా ఛాన్సులు వచ్చినట్టే వచ్చి జారిపోయేవి. 'అల్లాద్దీన్' సినిమాలో జాస్మిన్ పాత్ర కోసం నన్ను కూడా చూసినా, సరిగ్గా పాడలేకపోయానని తీసుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డా.
అతిపెద్ద కాంప్లిమెంట్ అదే...
అమ్మతో ఎంత చనువున్నా, నాన్నతో నాకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. నా మొదటి సినిమాకు సంతకం చేసినప్పుడు ఆయన నాకు కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ అసలు ఏమీ లేనట్టే ఉండేవారు. ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అనే భయం ఆయనకు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో చూస్తూ ఒకటే ఏడుపు! 'నువ్వు నా కూతురువంటే గర్వంగా ఉందిరా' అన్నారు. నేను అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్ అదే.
హ్యారీపోటర్ ఎంతిష్టమో!
హ్యారీపోటర్ సినిమాలకంటే పుస్తకాలు చాలా ఇష్టం. చదివిందే మళ్లీ మళ్లీ చదువుతుంటా. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్‌సీరీస్ అయితే ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. 'కుచ్‌కుచ్ హోతాహై' లాంటి సినిమా చేయాలనుంది.
హృతిక్ అంటే పిచ్చి
బహుశా నా వయసున్న వారందరికీ హృతిక్ రోషన్ యూనివర్సల్ క్రష్ ఏమో! అంత బావుంటాడు. చిన్నప్పటి నుంచీ తనంటే చాలా ఇష్టం. కానీ సినిమాల్లో చేయమంటే మాత్రం వరుణ్ ధావన్ పక్కన నటించడానికి ఇష్టపడతా.
వంద చాక్లెట్లు!
నేను కెరీర్ ప్రారంభంలోనే ఉన్నా అప్పుడే చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు! చాక్లెట్లూ, పువ్వులూ తీసుకొచ్చి నాకివ్వడం కోసం మా ఇంటి ముందు ఎదురుచూస్తూ ఉంటారు. నాకు పెర్క్ చాక్లెట్ అంటే ఇష్టమని తెలిసి ఒకసారి ఓ అభిమాని వంద చాక్లెట్లు బొకేలా చేసి ఇచ్చాడు!
సులభం కాదు
సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన అవకాశాలు సులభంగా వచ్చేయవు. నాకైతే చాలా ప్రయత్నించినా ఏ ఛాన్స్ దొరక్క... ఒకానొక సమయంలో పైచదువుల కోసం అమెరికా వెళ్లిపోదాం అనుకున్నా. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో సీటు కూడా దొరికింది. అయితే అప్పుడే నాకు 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'లో అవకాశం వచ్చింది! దెబ్బకు సర్దుకున్న లగేజీ మొత్తం విప్పేసి, ఆ సినిమా సెట్లో వాలిపోయా.
విజయ్ గురించి...
'అర్జున్‌రెడ్డి' సినిమా చూసి విజయ్ నటనకు ఫిదా అయిపోయా. తనతో సినిమా చేసే ఛాన్స్ రావడం, అదీ పాన్ ఇండియా ఫిల్మ్ కావడం నిజంగా నా అదృష్టం. స్క్రీన్ మీద తనను చూస్తే చాలా రఫ్‌గా కనిపిస్తాడు కానీ బయట చాలా మెతగ్గా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. ఈ సినిమా కోసం పూరీ జగన్నాథ్, ఛార్మిలను కలిసినప్పుడు నాకసలు కొత్త మనుషులతో ఉన్నానన్న ఫీలింగే రాలేదు. తను పెట్టుకున్న చెవి రింగులు చాలా బాగున్నాయని ఛార్మితో అంటే, వెంటనే తీసి ఇచ్చేసింది! అంత మంచి అమ్మాయి తను.