సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన పని కాదు. సినిమాల మీద ఇష్టంతో ఎన్నో కష్టాలు పడి నిలదొక్కుకున్న వారు ఉన్నారు. అలాగే తమ వల్ల కాక ఇంటిముఖం పట్టిన వారూ ఉన్నారు. కొందరు చదువును మధ్యలో ఆపేసి రంగుల ప్రపంచంలోకి వచ్చిన వారు మనకు తారసపడతారు. అలా చిత్రరంగంలో సత్తాచాటాలని భావించి ఇంజినీరింగ్ చదువును, ఉన్నత జీవితాన్ని మధ్యలోనే ఆపేసిన బాలీవుడ్ నటులెవరో చూద్దాం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
బాలీవుడ్ దివంగత యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)కు సినీ రంగంపై మక్కువ ఎక్కువ. అయితే సుశాంత్ తల్లిదండ్రులకు మాత్రం ఇతడు ఇంజినీరింగ్ పట్టా సంపాందించాలనేది కోరికి. అందుకోసం దిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో సీటు సంపాదించాడు కూడా. కానీ కాలేజీ రోజుల్లోనే సినిమాలపై ఇష్టంతో ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నాడు.
కృతి సనన్
టైగర్ ష్రాఫ్ నటించిన 'హీరోపంతి' చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టింది కృతి సనన్ (Kriti Sanon). దీనికంటే ముందు జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నోయిడా)లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ చేసింది. సినిమాల్లో అవకాశం రావడం వల్ల చదువును మధ్యలోనే వదిలేసింది.
కార్తిక్ ఆర్యన్
2011లో విడుదలైన 'ప్యార్ కా పంచ్‌నామా' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aryaan). ఈ కెరీర్‌ను ఎంచుకోక ముందు నేవీ ముంబయిలోనీ డీవై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్ చేశాడు. కానీ సినిమాల్లోకి రావాలన్న కోరికతో చదువును మధ్యలోనే నిలిపేశాడు.
విక్కీ కౌశల్
ముంబయిలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో చేరాడు విక్కీ కౌశల్ (Vicky Kaushal). ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ సినిమాలపై ఉన్న పిచ్చితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు.
తాప్సీ పన్ను
న్యూదిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేసింది తాప్సీ (Taapsee Pannu). ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగమూ సంపాదించింది. అనంతరం మోడలింగ్‌లో అడుగుపెట్టి సినీరంగంలోకి వచ్చేసింది. బాలీవుడ్లో సినిమాలు చేయడానికి ముందు తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాలు చేసింది.
సోనూసూద్
ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా మారిపోయాడు సోనూసూద్(Sonu Sood). ఇతడు 1999లో విడుదలైన తమిళ చిత్రం 'కల్లాఝగర్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశాడు. సినీ రంగంలోని అడుగుపెట్టడానికి ముందు యశ్వంతరావ్ చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (నాగ్‌పుర్)లో ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ చేశాడు.