మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో 'ఆదు జీవితం' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రబృందం షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లింది. కానీ కరోనా నేపథ్యంలో అక్కడ లాక్డౌన్ విధించారు. ఫలితంగా వారు ఆ దేశంలోనే చిక్కుకున్నారు. ఈ విషయమై నాన్ రెసిడెంట్ కేరళైట్స్ వ్యవహారాల విభాగం(నోర్కా) జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని గత శుక్రవారం సంప్రదించింది.
ప్రస్తుత పరిస్థితి గురించి జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి తెలియజేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నోర్కా కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై స్పందించిన దౌత్య కార్యాలయం.. చిత్రబృందం క్షేమసమాచారలపై నిర్మాతలను అడిగి తెలుసుకుంది. లాక్డౌన్ ముగిసే వరకు అక్కడే ఉండి చిత్రీకరణ చేయాలని భావించిన చిత్రయూనిట్‌కు సహకరిస్తామని హామీ ఇచ్చింది.
'ఆదు జీవితం' సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహిస్తుండగా.. పృథ్వీరాజ్ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ మలయాళ రచయిత బెన్యామిన్ రాసిన నవల ద్వారా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం జోర్డాన్‌లో జరుగుతున్న షూటింగ్‌కు తాత్కాలిక విరామాన్నిచ్చింది చిత్రబృందం. ఈ విషయంపై తన ఫేస్బుక్లో వివరణ ఇచ్చాడు పృథ్వీరాజ్.
నా క్షేమం కోరుకున్న వారికి ధన్యవాదాలు
ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ పనిచేయాలని.. ఈ సమయంలో పరిశుభ్రతతో కరోనాను ఎదుర్కోవచ్చని పృథ్వీరాజ్ అన్నాడు. ఈ పరిస్థితిలో తన భద్రత కోరుకున్న వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చూడండి.. కుటుంబంతో కలిసి 'రామయణం' చూసిన 'రాముడు'