బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఆనందంలో ఉన్నారు. తన తండ్రికి దక్కిన గుర్తింపునకు ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు పొందిన కవి. హిందీలో ఆయన ఎన్నో రచనలు చేశారు. సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన పొలాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. ఈ మేరకు పొలాండ్‌లోని వ్రోక్లా సిటీలో ఓ ప్రాంతానికి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు పెట్టనున్నట్లు వెల్లడించింది.
బచ్చన్ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన ఈ వార్త గురించి అమితాబ్ ట్వీట్ చేశారు.
" తమ నగరంలోని ఓ ప్రాంతానికి నా తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ పేరు పెట్టాలని వ్రోక్లా సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. దసరా రోజున దీనికంటే గొప్ప విషయం మరొకటి లేదు. భారతదేశంతోపాటు, వ్రోక్లాలో నివసిస్తున్న భారతీయులు, అలాగే మా కుటుంబమంతా ఎంతో గర్వించే విషయమిది. జైహింద్" అంటూ తన సంతోషాన్నివ్యక్తం చేశారు బిగ్‌బీ.