మీరు బాలీవుడ్‌లు సినిమాలు చూస్తారా? అయితే మీకో ప్రశ్న. అందులో కనిపిస్తున్న కొందరు స్టార్స్‌ది మనదేశం కాదు. కనీస భారతీయ పౌరసత్వం లేదు. అయినా సరే ఇక్కడ నటిస్తూ మనల్ని అలరిస్తున్నారు. అంతులేని వినోదాన్ని అందిస్తున్నారు. కానీ ఈ విషయం మీకు ఇప్పటివరకు తెలిసుండకపోవచ్చు. ఇంతకీ వారు ఎవరు? ఏయే దేశాలకు చెందినవారు? ఇలాంటి సంగతుల సమాహారమే ఈ కథనం.
ఆలియాభట్
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో అరంగేట్రం చేసిన ఆలియా భట్.. తక్కువ సమయంలోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీనటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే లండన్‌లో పుట్టి పెరిగిన ఈమెకు బ్రిటీష్ పౌరసత్వం ఉంది. తండ్రి మహేశ్‌భట్ భారత్‌లోని ప్రముఖ దర్శకుడు కాగా, తల్లి సోనీ రజ్దాన్.. బ్రిటీష్ నటి.
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్.. భారత్‌లో జరిగిన ఎన్నికల్లో మీరు ఎప్పుడైనా ఓటు వేయడం చూశారా? బహుశా చూసుండకపోవచ్చు. ఎందుకంటే అతడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టి పెరిగినా, కెనడా పాస్‌పోర్ట్ కోసం భారత పౌరసత్వాన్ని వదలుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడే ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. 2016లో 'రుస్తుమ్' సినిమాకుగాను జాతీయ నటుడిగా అవార్డును అందుకోవడం విశేషం.
కత్రినా కైఫ్
బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో కత్రినాకైఫ్ ముందుంటుంది. గత కొన్నేళ్లలో స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామ.. ఎన్నో సూపర్హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే హాంగ్‌కాంగ్‌లో పుట్టిన పెరిగిన కత్రినాకు ప్రస్తుతం బ్రిటీష్ పౌరసత్వం ఉంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
2009లో 'అల్లాదీన్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా, ప్రత్యేక గీతాల్లో కనువిందు చేసింది. అయితే ఈమె శ్రీలంకకు చెందిన నటి. 2006లో ఆ దేశ మిస్ యూనివర్స్‌గా నిలిచింది. అయితే ఈమె.. కెనడా, శ్రీలంక, మలేసియా మూలలున్న కుటుంబంలో జన్మించింది. బహ్రెయిన్‌లో పెరిగింది.
నర్గీస్ ఫక్రీ
'రాక్‌స్టార్' అనే రొమాంటిక్ డ్రామాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది నర్గీస్ ఫక్రీ. ఆ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆ తర్వాత 'మద్రాస్ కేఫ్', 'హూస్ఫుల్ 3' వంటి చిత్రాల్లో నటించింది. ఆసక్తికర విషయం ఏంటంటే న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో పుట్టిన నర్గీస్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. ఈమె నాన్నది పాకిస్థాన్ కాగా, అమ్మది చెక్.
ఇవీ చదవండి: