లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్, రాములమ్మ ఈ పేర్లు వినగానే టక్కున గుర్తొచ్చేది టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం 'కిలాడి కృష్ణుడు'. ఇందులో కృష్ణ హీరోగా నటించారు. విజయనిర్మల దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదలై శనివారంతో 40 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా విజయశాంతి.. తన 40ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
"నా మొదటి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు విడుదలై 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు. నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలు."
-విజయశాంతి, టాలీవుడ్ సీనియర్ నటి.
1980లో ప్రవేశించి అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి ప్రత్యేకతను చాటుకున్నారు విజయశాంతి. 1985లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన 'ప్రతిఘటన' చిత్రంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలోని ఆమె నటించిన పాత్రకు నంది అవార్డు వరించింది. తెలుగులో అగ్రకథానాయకులందరితోనూ కలిసి నటించింది.
ఆమె నటించిన రేపటి పౌరలు, నేటిభారతం, ముద్దులమావయ్య, గ్యాంగ్‌లీడర్, జానకిరాముడు, చిన్నరాయుడు ప్రేక్షకులను మెప్పించాయి. 'కర్తవ్యం' చిత్రానికి అక్షరాల కోటి రూపాయల పారితోషికం అందుకుంది. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయికగా ఆమె అని చెప్పుకోవచ్చు. ఇటీవల మహేష్‌బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.
ఇదీ చూడండి టిప్పుగా అక్షయ్‌కుమార్‌కు ముద్దిచ్చిన మహిళ