Road Accidents are Increasing Due to Snow : శీతాకాలం మొదలైంది. పొగమంచు పగబడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఈ సీజన్‌లో కురిసే మంచు కారణంగా వాహనాలు అత్యంత దగ్గరికి వచ్చినా కనిపించడం లేదు. కొందరు వాహనదారుల అజాగ్రత్తతో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. జాగ్రత్తలతో సురక్షిత ప్రయాణాలు చేయాలని, రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచాల్సి వస్తే ఇతరులు ప్రమాదాలకు గురవకుండా హెచ్చరిక లైట్లు వేసి ఉంచాలని పోలీసులు పేర్కొన్నారు. రేడియం స్టిక్కర్లు కనిపించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.
తెలంగాణను వణికిస్తున్న చలి పులి - ఇది ట్రైలర్ మాత్రమే - అసలు సినిమా ముందుంది!
శీతాకాలం కారణంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనాదారులకు రవాణాశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు
- సొంత కార్లు, ద్విచక్రవాహనాలపై అర్ధరాత్రి, తెల్లవారుజాముల ప్రయాణాలు వీలైనంత మేర సాగించకుడదని తెలిపారు. ఉదయం 8గంటలు దాటిన తర్వాత సొంత వాహనాల్లో ప్రయాణాలు మొదలు పెట్టాలని సూచించారు.
- మంచు పడుతున్నప్పుడు ఫాగ్‌లైట్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
- కొన్ని సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించవు. అలాంటప్పుడు అతివేగంతో వాహనం అస్సలు నడపకూడదు. ఒక్కోసారి రోడ్డుపై వాహనం జారిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
- పరిమిత వేగంలో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే కనీసం 50 అడుగుల దూరంలో వాహనం ఆగుతుంది. అతి వేకంగా ఉన్నప్పుడు 90 అడుగుల దారంలో నిలుస్తాయి. అకస్మాత్తుగా బ్రేకలు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి సాధారణ వేగంలోనే వీలైనంత వరకు వాహనాలు నడపాలి అప్పుడే నియంత్రణ సాధ్యమవుతుంది.
- మంచు సీజన్‌లో వాహన సామర్థ్యం సరిగా ఉండేలా చూసుకోవాలి. వైపర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? బ్రేకులు సమస్యల్లేకుండా ఉందా అని చెక్ చేసుకోవాలి?
- కారులో వెళ్లేటప్పుడు హీటర్ ఉపయోగించాలి. దీనివల్ల ముందు అద్దాలు ఆవిరిపట్టకుండా ఎదుటి వాహనాలను సరిగ్గా గమనించేందుకు వీలు ఉంటుంది.
- ఒకవేళ దట్టమైన మంచుతో ముందుగు సాగలేని పరిస్థితి ఉంటే రోడ్ బేలు, పెట్రోల్ బంకుల వద్ద ఆగడం మంచిది.
శీతాకాలంలో జిల్లాలోని ప్రధాన రహదారుల పక్కన భారీ వాహనాలు నిలపకుండా లారీ, సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్ తెలిపారు. మంచు వేళల్లో వేగ నియంత్రణ ఆవశ్యకత గురించి సూచిస్తున్నారన్నారు. పెట్రోలింగ్‌ను పెంచుతామని, కార్లు, సొంత వాహనాలున్న వారు అత్యవసరమైతే తప్ప చీకట్లో ప్రయాణాలు సాగించకపోవటం ఉత్తమమని సూచించారు.