Minister Komatireddy On Allu Arjun : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా తన ఇమేజ్ దెబ్బతీశారంటూ అర్జున్ మాట్లాడటం సరికాదన్నారు. నిన్న సాయంత్రం(శనివారం) జరిగిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటి రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనటం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ అన్నమాటలు వెనక్కి తీసుకోవాలి : మరోవైపు ఇదే అంశంపై పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ తెలిపారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్యులను కష్టపెడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ప్రజలకు ధైర్యం, భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే స్వాగితించాల్సింది పోయి, వెంటనే సీనీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బలుమూరు వెంకట్ ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై నటుడు అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎవరు తప్పు చేసినా ప్రజా ప్రభుత్వంలో న్యాయం, ధర్మం వైపు అండగా నిలవాల్సిన బాధ్యత సీఎంకు ఉంటుందని అదే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరిని అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేస్తే ఆ వెంటనే అర్జున్ మీడియా సమావేశం పెట్టడం సరిగాదని వెంకట్ మండి పడ్డారు.
అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది : సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని, అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరముందని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సూచనలు చేస్తే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందని దానిలో భాగంగానే అల్లుఅర్జున్ సినిమాకు టికెట్ రేట్లు పెంచి ఆదుకున్న విషయాన్ని చామల గుర్తుచేశారు.
అలా అనడం విడ్డూరంగా ఉంది : 'సంధ్య థియేటర్ వద్ధ జరిగిన ఘటన గురించి సీఎం వాస్తవాలు ప్రజలకు వెల్లడిస్తే హీరో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి ఎవరో రాసిచ్చిన నోట్ చదివి వెళ్లిపోయారు తప్ప, బాధ్యతగా వ్యవహరించలేదని' చామల కిరణ్ కుమార్ తెలిపారు. అల్లు అర్జున్ ప్రజలకు ఏం సందేశం చెప్పాలనుకుంటున్నారో కనీస అవగహన లేకుండా ప్రవర్తిస్తున్నారని చామల విమర్శించారు. ప్రముఖులు భయటకు వెళ్లినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా బాధ్యతగా ఉండాలని సీఎం రేవంత్ చెప్పినప్పుడు హీరోను టార్గెట్ చేస్తున్నారనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు హీరోలను రియల్ హీరోలుగా అనుకుంటారు కనుక నిజ జీవితంలోనూ సీనీ హీరోలు సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు - టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఉండదు! : మంత్రి కోమటిరెడ్డి
టికెట్ ధరలు పెంచుకునేందుకు వచ్చే నిర్మాతలకు ఇకపై సమయం ఇచ్చేది లేదు : కోమటిరెడ్డి