మనకు తెలిసిన అనుష్క.. అందం, నటనలో ఆల్‌రౌండర్, ఇండస్ట్రీలో స్టార్లందరికీ డియరెస్ట్, స్వీటీలో ఆకట్టుకునే కోణాలెన్నో, తన దగ్గర పని చేసేవాళ్లకు పెద్దపెద్ద నజరానాలు ఇస్తుంది. అభిమానుల పుట్టినరోజు వేడుకల్ని స్వయంగా జరుపుతుంది. మూగ జీవాల్ని అక్కున చేర్చుకుంటుంది. ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌లో మిస్ పర్‌ఫెక్ట్ అనిపించుకుంటున్న ఈ అందాల బొమ్మ పరిశ్రమకొచ్చి పదిహేనేళ్లయింది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగూ తనకో పాఠం నేర్పిందని చెప్పాంది. తాను అనుసరిస్తున్న 12 సూత్రాలే తన కెరీర్‌కు సోపానాలయ్యాయని చెప్పింది.
ఇష్టపడితేనే ఉండగలుగుతాం
"పరిశ్రమకొచ్చి పదిహేనేళ్లయినా నిన్నో, మొన్నో వచ్చినట్టే అనిపిస్తోంది. హీరోయిన్‌గా ఇది ఎక్కువ సమయమేనంటారు. ఇది నేనొప్పుకోను. నా దృష్టిలో ఇది చిన్న ప్రయాణమే. అయితే ఎక్కువ కాలం ఉండాలంటే ఎక్కువ కష్టపడాలి. చేస్తున్న వృత్తిమీద ఇష్టం ఉండాలి. పనిపై ప్రాణం పెట్టాలి."
నేర్చుకుంటూనే ఉన్నా
"పరిశ్రమకు వచ్చినప్పుడు నాకేం తెలియదు. నటన రాదు. వేటిపైనా కనీస అవగాహన లేదు. మొదటిసారి కెమెరా ముందుకు వెళ్లినప్పుడు భయమేసింది. కొద్దిరోజులు నటన నేర్చుకుని దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పింది చేశా. నేర్చుకుంటూనే ఉన్నా. ఇప్పటికీ నేను కెమెరా ముందుకెళ్తే భయంతో, జాగ్రత్తతో, ఇష్టంతో పని చేస్తా. అమ్మాయిలు ఏ రంగంలో ఉన్నా ఈ లక్షణాలే గెలిపిస్తాయి."
విజయం అందరిదీ
"మన విజయంలో చాలామందికి భాగముంటుంది. మా ఇంట్లో అంతా ఇంజినీర్లు, డాక్టర్లే. చదువయ్యాక నేను యోగా కెరీర్‌గా ఎంచుకుంటానంటే ఇంట్లోవాళ్లు షాక్. కానీ నా ఇష్టాన్ని కాదనలేదు. నాపై నమ్మకం ఉంచారు. మాది సంప్రదాయ కుటుంబమైనా సినిమాల్లోకి వెళ్తానంటే ప్రోత్సహించారు. దీంతోపాటు నా సహనటులు, టెక్నీషియన్లు.. వీళ్లలో ఏ ఒక్కరి సహకారం లేకపోయినా నాకు విజయాలు వచ్చుండేవి కావు"
అన్నింటికీ సిద్ధం
"ముందు మెడిసిన్ చేయాలనుకున్నా. సైక్రియాట్రిస్ట్ కావాలనుకున్నా. చివరికి సినిమాల్లోకి వచ్చా. కానీ ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా ఎప్పటికీ స్వీటీలాగే ఉండాలనుకున్నా. ముందు మనం మనుషులం. వ్యక్తిత్వం బాగుండాలి. సినిమాల్లోకి వస్తే ఒక స్టేటస్ ఉంటుంది. స్టార్‌డమ్ వస్తుంది. దాంతోపాటు కొన్ని కష్టాలూ ఉంటాయి. ఇవన్నీ వృత్తిలో భాగం అనుకున్నప్పుడే దాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలి."
మనం బాగుంటేనే..
"మిమ్మల్ని ఇండస్ట్రీలో చాలామంది ఇష్టపడతారు, గౌరవిస్తారు అని చెబుతుంటారు. ఇందులో పెద్ద రహస్యమేం లేదు. మనతో అవతలివాళ్లు ఎలా ఉండాలనుకుంటారో, మనమూ వాళ్లతో అలాగే ఉండాలి. నేను పనిచేసే చోట నా చుట్టూ అంతా సానుకూలంగా, సౌకర్యంగా ఉండాలనుకుంటా. నేనూ అందుకు తగ్గట్టు ప్రయత్నిస్తా. సినిమాలైనా, మరో చోటైనా"
వందశాతం ఇవ్వాలి
"ఫలానా హీరోతో నటించాలి. ఫలానా పాత్ర చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. మంచి సినిమాలు, పాత్రలు చేయాలనుకున్నా. చేసేది ఏ సినిమా అయినా వంద శాతం మనసు పెట్టి పనిచేశా. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలిలాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న గొప్ప పాత్రలొచ్చాయి. సిన్సియర్‌గా పని చేసుకుంటూ వెళ్తే విజయం మన వెనకే వస్తుంది."
మనం మనలాగే
"నేను స్కూల్, కాలేజీల్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడకపోయేదాన్ని. చదువులోనూ అంతంత మాత్రమే. కొంతమందే స్నేహితులు. మా ప్రిన్సిపల్ ఆంగ్లో ఇండియన్. నేను బ్రిలియెంట్ విద్యార్థి కాకపోయినా నన్ను బాగా ఇష్టపడేవారు. సొంత కూతురిలా చూసుకునేవారు.. దీన్ని బట్టి నాకు అర్థం అయ్యిందేంటంటే మనం ఎలా ఉన్నా కొందరు మన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. మనం మనలాగే ఉండాలి."
మార్పు మనతోనే
"మహిళలపై అత్యాచారాలు, నిర్భయ, దిశలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు బాధ అనిపిస్తుంది. దానిమీద కామెంట్ చేయడం, అభిప్రాయం చెప్పడం, సూచనలివ్వడం తేలికే. కానీ ఒకరు చెబితే సమాజం మారదు. ఇల్లు, స్కూల్, కాలేజీ దశల్లోనే మార్పు మొదలవ్వాలి. ఎవరికి సాధ్యమైనంత మేర వారు ప్రయత్నిస్తే మన బాధ్యత నెరవేర్చినట్టే."
ఎవరి అనుభవం వారిదే
"సినిమా పరిశ్రమపై కొన్ని విమర్శలున్నాయి. అమ్మాయిలకు భద్రత లేదంటారు. మీటూ ఉద్యమం, రకరకాల వార్తలొస్తున్నాయి. అది నిజమా? కాదా? ఏదీ చెప్పలేం. ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం వేరు, ప్రయాణం వేరు, అనుభవం వేరు. నా విషయానికొస్తే ఈ పరిశ్రమే చాలామంది శ్రేయోభిలాషులను ఇచ్చింది. మనం నిజాయతీగా లేకపోతే మంచి సమాజం ఎలా ఏర్పడుతుంది?"
అభిమానిస్తే దగ్గరవుతారు
"నేను టీవీ చూడను. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. అయినా హితులు, అభిమానులు ఎంతోమంది. అనుష్క శెట్టి ఫ్యాన్‌క్లబ్ (ఏఎస్‌ఎఫ్) ఉంది. వాళ్లు నన్నెంతో అభిమానిస్తారు. నా పుట్టినరోజుకు కలుస్తారు. వాళ్ల పుట్టిన రోజులు నా దగ్గరికొచ్చి జరుపుకుంటారు. మనం మనస్ఫూర్తిగా ఎవరిపైనయినా అభిమానం చూపిస్తే వాళ్లు అభిమానిస్తూనే ఉంటారు."
వాళ్లే ముఖ్యం
"మనం ఖాళీగా ఉన్నా, సూపర్‌స్టార్‌లా ఎదిగినా ఎప్పుడూ స్వచ్ఛమైన ప్రేమను పంచేది అమ్మానాన్నలే. ఎన్ని రూమర్లు వచ్చినా పట్టించుకోకుండా కంటిపాపలా కాచుకునే కన్నవాళ్లని మించిన స్ఫూర్తిప్రదాతలు ఎవరుంటారు? నా జీవితంలో ఒక గొప్ప పేరు చెప్పాల్సి వస్తే అది అమ్మే అవుతుంది. నాకే కాదు.. ఎవరికైనా అమ్మే పెద్ద బలం."
అనుకరించొద్దు
"కాలేజీ అమ్మాయిలు అందంగా ఉండాలనుకుంటారు. అనుష్కలా కావాలనుకుంటారు. అది తప్పు. ఎవర్నీ అనుకరించొద్దు. ప్రతి ఒక్కరిలో ఒక్కో ప్రతిభ, సొంత వ్యక్తిత్వం ఉంటుంది. మీరు 'బి ద బెస్ట్'గా ఉండాలి. సినిమాలు, మోడలింగ్, మరోటి.. ఇతరులను అనుకరించాలనుకోవద్దు. ఎవరూ ఎవరికన్నా గొప్పకాదు."
మొదటి ప్రపోజల్: నా ఎత్తు ఎక్కువ. ఎప్పుడూ సీరియస్‌గా ఉండేదాన్ని. నా వెంట పడటానికి అబ్బాయిలు జంకేవాళ్లు. అయినా కాలేజీ రోజుల్లో ఒకబ్బాయి ప్రపోజ్ చేశాడు. వెళ్లి మా నాన్నకు చెప్పమన్నా. పారిపోయాడు.
నెర్వస్ ఫీలవుతా: షూటింగ్ చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు ఎదురుగా ఉంటే నెర్వస్‌గా, భయంగా ఉంటుంది. వాళ్లు మొదటి సినిమాకే సెట్‌లో ఉన్నారు. తర్వాత ఎప్పుడూ షూటింగ్‌కు రాలేదు.
ఆహారం: యోగా, వ్యాయామం నా దినచర్యలో భాగం. ఈ పదిహేనేళ్లలో చేసే పాత్రలకు అనుగుణంగా బరువు పెరిగా, తగ్గా. క్యారెక్టర్‌కు అనుగుణంగా తిండి, కసరత్తులు ఉంటాయి. సమతులాహారం, వ్యాయామం ఏ అమ్మాయికైనా ముఖ్యమే.
పెళ్లి, ప్రేమ: నేను పెళ్లికి, రిలేషన్‌షిప్‌కు వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరితో చెప్పి పెళ్లి చేసుకుంటా.
కాబోయే వరుడు: ఇలాంటి లక్షణాలే ఉండాలనుకోను. అతడు మంచి వ్యక్తి కావాలి. నిజాయతీగా ఉండాలి.
ఖాళీగా ఉంటే: ప్రయాణాలు చేస్తుంటా. మూగజీవాలతో ఆడుకుంటా.
డేటింగ్: క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నాననీ, రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌తో ప్రేమలో ఉన్నాననీ విన్నాను. అవి తప్పుడు వార్తలు. ప్రేమలో పడితే దాచుకోను. అన్ని విషయాల్లాగే అదీ చెబుతా.
ఇదీ చూడండి.. కరోనా దెబ్బకు చిన్న సినిమా నిర్మాతల విలవిల