కరోనా లాక్డౌన్.. చాలా పరిశ్రమలపై పలు రకాలుగా తీవ్ర ప్రభావం చూపింది. టాలీవుడ్ ఇందుకు అతీతమేమీ కాదు. మార్చి మూడో వారంలో మూసిన థియేటర్లను ఈ మధ్యే తెరిచారు. దీంతో వెండితెరపై విడుదల అవ్వాల్సిన చాలా చిత్రాలు.. ఓటీటీలను ఆశ్రయించాయి. పరిస్థితులు ఎప్పుడు సర్దుకుంటాయో తెలియక ఓవైపు, ఆర్థిక ఇబ్బందులు మరోవైపు ఉండటం వల్ల నిర్మాతలు ఓటీటీ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో తెలుగులో చిన్న చిత్రాల నుంచి పలు పెద్ద సినిమాలు విడుదలై ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. అందులో మీరు ఏమేం చూశారు? ఒకవేళ చూడకపోతే ఆ జాబితా ఇదిగో!
కృష్ణ అండ్ హిజ్ లీల
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం.. జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణ, అతడి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ మధ్య సాగే కథనమే ఈ సినిమా. సిద్ధు, సీరత్ కపూర్, శ్రద్ధా శ్రీనాథ్, షాలిని హీరోహీరోయిన్లు. రవికాంత్ దర్శకుడు.
భానుమతి & రామకృష్ణ
'ఆహా'లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ సినిమా. జులై 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 30ల్లో ఉన్న అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథతో దీనిని తెరకెక్కించారు. నవీన్ చంద్ర, సలోనీ లుథ్రా నటనతో మెప్పించారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు.
![Bhanumathi Ramakrishna OTT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9935440_movie-story-8.jpg)
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
'మహిశంతే ప్రతీకారమ్'కు రీమేక్ ఈ సినిమా. జులై 30 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించగా, వెంకటేశ్ మహా దర్శకత్వం వహించారు. మహేశ్ అనే కుర్రాడు అనుకోకుండా ఓ గొడవలో ఇరుక్కుని దెబ్బలు తగిలించుకుంటాడు. ఆ తర్వాత తన పగ ఎలా తీర్చుకున్నాడనేదే కథాంశం. ఓటీటీలో వచ్చిన తెలుగు సినిమాల్లో ప్రేక్షకుల పరంగా చూస్తే ఇదే తొలి హిట్!
![Uma Maheswara Ugra Roopasya OTT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9935440_movie-story-6.jpg)
వి
నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వి'. సెప్టెంబరు 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. సైకో విలన్‌కు, పోలీస్ అధికారికి మధ్య జరిగే మైండ్‌గేమ్ నేపథ్యంతో ఈ సినిమా తీశారు. అయితే అంచనాల్ని అందుకోవడంలో ఈ చిత్రం విఫలమైందనే చెప్పాలి!
![V MOVIE NANI SUDHEER BABU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9935440_movie-story-7.jpg)
నిశ్శబ్దం
స్వీటీ అనుష్క నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'నిశ్శబ్దం'. మాధవన్, అంజలి, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దివ్యాంగురాలి పాత్ర పోషించిన అనుష్క.. ఓ హత్యకు సాక్షి అవుతుంది. ఆ హత్యను పోలీసులు ఎలా ఛేదించారనేదే ఈ సినిమా. ఈ సినిమా కూడా నెటిజన్లను ఆకర్షించలేకపోయింది.
![anushka shetty Nishabdham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9935440_movie-story-4.jpg)
ఒరేయ్ బుజ్జిగా
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా.. 'ఆహా'లో అక్టోబరు 2న విడుదలైంది. రాజ్‌తరుణ్, మాళవిక, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లు. ఒకే ఊరికి చెందిన, అసలు పరిచయమే లేని అబ్బాయి, అమ్మాయి.. ఒకేసారి ఇంటి నుంచి వెళ్లిపోతారు. దీంతో ఆ ఊర్లో అందరూ వాళ్లిద్దరూ లేచిపోయారని భావిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా. పూర్తి ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.
కలర్ ఫోటో
90ల్లో రంగు, కులం కారణంగా ఓ ప్రేమజంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పుడు ఏం జరిగింది? లాంటి సున్నితమైన అంశాలతో రూపొందిన సినిమా 'కలర్ ఫోటో'. సుహాస్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా, సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. 'ఆహా'లో అక్టోబరు 24న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది.
![colour photo movie news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9935440_movie-story-1.jpg)
గతం
సైకలాజికల్ థ్రిల్లర్‌గా తీసిన 'గతం'.. అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 6న విడుదలైంది. రాకేశ్, పూజిత నటించగా, కిరణ్ రెడ్డి దర్శకుడు. గతం మర్చిపోయిన రిషి.. ఆస్పత్రిలో నిద్ర లేస్తాడు. తనకు అసలు ఏం జరిగింది? ఇక్కడ ఎందుకు ఉన్నానో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్‌కు గురి చేస్తుంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది.
మిడిల్ క్లాస్ మెలొడీస్
కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించింది. అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 20న విడుదలై హిట్‌గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ కలిసి నటించగా, వినోద్ అనంతోజుకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. గుంటూరు నేపథ్యంగా దీనిని తెరకెక్కించారు.
![Middle Class Melodies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9935440_movie-story-3.jpg)
మిస్ ఇండియా
కీర్తి సురేశ్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. నవంబరు 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. యువ మహిళా పారిశ్రామికవేత్త సంయుక్త.. 'చాయ్' బిజినెస్‌లో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొని విజయం సాధించింది అనేదే చిత్రం. అయితే అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేక నిరాశపరిచింది.
![keerthy suresh miss india OTT release](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9935440_movie-story-2.jpg)
మా వింత గాధ వినుమా
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సిద్ధు, సీరత్ కపూర్ జంటగా నటించారు. 'ఆహా'లో నవంబరు 13న విడుదలైంది. ఓ యువ ప్రేమ జంట వీడియో వైరల్‌గా మారడం వల్ల వాళ్లు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? తర్వాత పరిణామాలు ఏంటి? అనేదే చిత్ర కథాంశం. ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
ప్రస్తుతం థియేటర్లను తెరుచుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన నేపథ్యంలో 'సోలో బ్రతుకే సో బెటర్', 'క్రాక్', 'రెడ్' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని చిత్రాలు ఓటీటీవైపు అడుగులేస్తున్నాయి.
ఇవీ చదవండి:
- 2020.. ఓటీటీ నామ సంవత్సరం!
- ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, సిరీస్‌లు.. మీకోసమే
- ఓటీటీ వేదికలపై వీళ్లే నయా 'గేమ్ ఛేంజర్లు'
- ఓటీటీకే ఓటేస్తున్న అగ్రతారల సినిమాలు!
- ఓటీటీల్లో హిట్టు మాట వినపడినట్లేనా!
- ఓటీటీల్లో నటించేందుకు చిరంజీవి సిద్ధం
- ఔను.. 'ఓటీటీ'పై మనసు పడుతున్నారు!
- లాక్డౌన్లో ఊపందుకున్న ఓటీటీ ట్రెండ్
- ఓటీటీల్లో రాజ్యమేలుతున్న అలాంటి వెబ్‌సిరీస్‌లు
- ఓటీటీ వర్సెస్ థియేటర్: ఎవరి సత్తా ఎంతంటే?
- ఓటీటీల బాటలో భారతీయ సినీ ప్రేక్షకులు
- ఓటీటీ వేదికగా సుకుమార్ ప్రేమకథలు!