వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందించేందుకు సామాజిక మాధ్యమాలు పోటీ పడుతూ ఉంటాయి. వాటిల్లో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ కూడా ఒకటి. తాజాగా.. ఈ వీడియో యాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ వల్ల.. ప్రాంతీయ భాషలో సెర్చ్ చేస్తే వీడియోలు కనపడతాయి. అయితే వాటి టైటిల్స్, డిస్క్రిప్షన్, క్యాప్షన్ కూడా ఆటోమాటిక్‌గా ప్రాంతీయ భాషల్లోకి అనువాదించి ఉంటాయని సమాచారం. ప్రస్తుతానికి ఈ ఫీచర్.. యాప్, వెబ్‌లో ఇంగ్లీష్ నుంచి పోర్చుగీస్లోకి ట్రాన్స్‌లేట్ చేస్తోంది.
ప్రాంతీయ భాషల్లోకి...
ఈ ఫీచర్ పనితీరుపై ఇప్పటివరకు సరైన స్పష్టత లేదు. అయితే యూజర్లు.. ఏవైనా వీడియోలను తమ ప్రాంతీయ భాషలో సెర్చ్ చేస్తే.. ఇంగ్లీష్‌లో ఉన్న టైటిల్స్ అనువదించి కనపడతాయని ఓ నివేదిక పేర్కొంది. ప్రముఖ ఛానెల్స్‌కు చెందిన వీడియోలు కూడా కనిపిస్తాయని తెలిపింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్లో .. ఇంగ్లీష్‌లో వెతికినా.. ఫలితాలు ప్రాంతీయ భాషల్లో వస్తున్నాయి. కానీ ఆ ఫీచర్ సరిగ్గా పనిచేస్తుందా? అన్న అనుమానాలు ఎక్కువే ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. సక్సెస్ అయితే మరిన్ని భాషలతో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇలా పనిచేస్తుంది...!
ఇందులో అనువాదానికి సంబంధించి ఓ పాప్-అప్ వస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే.. వీడియో టైటిల్స్, డిస్క్రిప్షన్, క్యాప్షన్లు ఆటోమాటిక్‌గా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం అవుతాయి.
ఈ ఫీచర్ ఆంగ్ల భాష మాట్లాడని రెండు బిలియన్ మంది యూజర్లకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది.
దీనిపై యూట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చూడండి:- యూట్యూబ్: పైకి లాగితే ఫుల్ స్క్రీన్