Whatsapp Voice Status: లేచిన వెంటనే వాట్సాప్ స్టేటస్‌లు చూడకపోతే కొందరికి తెల్లవారదు. ఉదయం లేచేసరికి ఎవరేం పెట్టారో చూడకపోతే ఆ క్షణం మనసొప్పదు. అంతగా ప్రజలకు చేరువైంది వాట్సాప్ స్టేటస్. ఇప్పటి వరకు స్టేటస్ రూపంలో ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్, ఏవైనా లింకులు మాత్రమే కనిపించేవి. ఇకపై వాయిస్ కూడా స్టేటస్ రూపంలో దర్శనమివ్వనుంది. త్వరలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం వాట్సాప్ ఐఓఎస్ బీటా వెర్షన్‌లో కొందరు యూజర్లకు స్టేటస్ సెక్షన్‌లో ఈ వాయిస్ స్టేటస్ దర్శనమిచ్చిందని WABetaInfo పేర్కొంది. 30 సెకన్ల వరకు ఆడియోను స్టేటస్‌గా పెట్టుకోవచ్చని తెలుస్తోంది. సాధారణ స్టేటస్ మాదిరిగానే 24 గంటల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు ఇప్పటి వరకు 'గుడ్‌మార్నింగ్ ఆల్' అంటూ స్టేటస్ పెట్టేవారు.. ఇకపై అదే సందేశాన్ని వాయిస్ రూపంలో స్టేటస్‌గా పెట్టొచ్చన్నమాట. ఈ సదుపాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారన్నది మాత్రం తెలియరాలేదు.