Digital twin software: ఏదైనా ఒక క్లిష్ట సమస్య ఎదురైనప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ఓ 'యంత్రం' ముందుగానే చెప్పేస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది? ఎన్నికల్లో ఎవరికి ఓటెయ్యాలన్నదానిపై మీ మనసులో ఉన్న మాటను అది సరిగ్గా బయటపెడితే ఎంతటి విస్మయం కలుగుతుంది? ప్రస్తుతానికి కాల్పనిక సైన్స్‌లానే అనిపిస్తున్నా.. రానున్న దశాబ్ద కాలంలో ఇలాంటి కొంగొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యక్తుల ప్రవర్తన తీరును క్షుణ్నంగా పరిశీలించి.. అచ్చం వారి తరహాలో ప్రవర్తించే 'డిజిటల్ కవల'లను రూపొందించొచ్చని వివరిస్తున్నారు.
డేటాను ఏఐతో జోడించి..
సృష్టిలో ప్రతిఒక్కరికీ తమదైన విలక్షణ శైలి ఉంటుందన్నది అందరూ చెప్పే మాట. ఆ భావన తప్పని నిరూపించగలమని కెనడా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రతి వ్యక్తికి తాము డిజిటల్ కవలలను సృష్టించగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తుల ప్రవర్తన శైలి, ప్రాధాన్యతలు, ఇష్టాయిష్టాలు, వారి చుట్టూ ఉండే వాతావరణం, సామాజిక పరిస్థితులు వంటి సమాచారమంతా సేకరించి.. దాన్ని కృత్రిమ మేధ (ఏఐ)తో జోడించడం ద్వారా డిజిటల్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ వ్యక్తి షాపింగ్ సముదాయంలో అడుగుపెట్టాక ఏం కొనుగోలు చేస్తాడన్న సంగతి నుంచి మొదలుకొని, ఏఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో అన్నీ 'డిజిటల్ కవల' ముందే చెప్పేయగలదని వివరించారు. ప్రధానంగా వ్యాపార సంస్థలు తమ వినియోగదారుల వ్యవహార శైలిని పర్యవేక్షించేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుందని తెలిపారు. వివిధ ఉత్పత్తులు, ప్రక్రియలకూ ఈ తరహా కవలలను ఆవిష్కరించొచ్చని పేర్కొన్నారు.
విద్రోహ శక్తుల చేతుల్లో పడితే ముప్పు
ఉపయోగాల సంగతెలా ఉన్నా.. డిజిటల్ కవలల వల్ల సామాజిక, నైతికపరమైన సమస్యలు తలెత్తే ముప్పుందన్నది మరికొందరి మాట. వీటి తయారీ కోసం సేకరించే డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం. డిజిటల్ ప్రతిరూపాలకు సంబంధించిన లాగిన్‌ను సంఘ విద్రోహ శక్తులు చేజిక్కించుకుంటే తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. చుట్టూ ఉండే పరిస్థితుల కారణంగా వ్యక్తుల ప్రవర్తన తీరు మారే అవకాశాలుంటాయి. కాబట్టి డిజిటల్ కవలలనూ నిరంతరం తదనుగుణంగా అప్‌డేట్ చేసుకున్నప్పుడే వాటితో ప్రయోజనాలు ఒనగూరుతాయి.
సమాచార సేకరణ సవాలే
డిజిటల్ ప్రతిరూపాల తయారీ అంత సులువు కాదు. ఇందుకోసం వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పెద్దమొత్తంలో, అత్యంత కచ్చితత్వంతో సేకరించాలి. అందుకు అత్యాధునిక సెన్సర్లు అధిక సంఖ్యలో అవసరం. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించే సమర్థ సాంకేతికతను అభివృద్ధి చేయగలగాలి.