Aishwarya Rai Birthday : ఆ అందాల రాశిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన నీలి కళ్ల సోయగం అలా వెండితెరపై వెలుగులు జిమ్ముతుంటే ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. వయసు పెరిగినా వన్నె తరగని అందంతో ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది ఈ విశ్వసుందరి. ఆమెవరో కాదు మన స్టార్ బ్యూటీ ఐశ్వర్యరాయ్. నేడు ఆమె బర్త్‌డే ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
- కర్ణాటకలోని మంగుళూరలో జన్మించారు ఐష్. తన ఫ్యామిలీలో అందరూ చదువుకున్నవారే అవ్వడం వల్ల ఆమెకు చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలన్న ఆసక్తి ఏర్పడింది. అయితే కాలేజీ డేస్‌లో మోడలింగ్‌పై మనసు మళ్లింది. అదే సమయంలో ఆమెకు యాడ్స్‌లో మెరిసే ఛాన్స్ దక్కింది. అలా ఆమె నటించిన 'పెప్సీ' యాడ్ మంచి పేరు తీసుకురావడం వల్ల మోడలింగ్ వైపుకు అడులేశారు. ఆ తర్వాత 1994లో 'మిస్ వరల్డ్' కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
- 15 ఏళ్లలో వయసులోనే ఐష్ ఓ ప్రముఖ పెన్సిల్ కంపెనీకి సంబంధించిన యాడ్‌లో మెరిశారు. ఆ తర్వాత 1992-1993 టైమ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌తో కలిసి కూల్‌డ్రింక్ యాడ్ చేశారు. దీని షూటింగ్ మొత్తం ఒకే రాత్రిలో జరిగిందట. ఈ ఒక్క యాడ్‌తో ఐష్ పేరు మోడలింగ్ ఫీల్డ్‌లో మార్మోగిపోయింది.
- 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత వరుసగా ఐష్‌కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కానీ, ఆమె తన సినిమా డెబ్యూ మాత్రం అదిరిపోయేలా ఉండాలని భావించారు. అలా 1997లో మణిరత్నం తెరకెక్కించిన 'ఇరువర్' (ఇద్దరు) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే డ్యూయెల్ రోల్ చేసి మెరిశారు.
- 'కాసాబ్లాంకా' అనే హాలీవుడ్ మూవీ అంటే ఐష్‌కి చాలా ఇష్టం. తన ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా అదేనట. ఒక వేళ బాలీవుడ్‌లో ఈ సినిమాను రీమేక్ చేస్తే మాత్రం కచ్చితంగా నటిస్తానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
- ఐష్‌కి వాచ్‌లంటే చాలా ఇష్టం. కొత్తగా వచ్చిన మోడల్ వాచ్‌లన్నింటినీ సేకరించడం ఆమె హాబీ. ఆమెకు ఆభరణాలంటే కూడా మక్కువేనట. కొన్నింటిని మాత్రం తనే సొంతంగానే డిజైన్ చేసుకుంటారట.
- ఐష్‌కు భారత్‌లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె నటించిన 'జోధా అక్బర్'లో ఆమె ఆహార్యం ఆధారంగా బార్బీ బొమ్మలను కూడా తయారు చేశారు. బ్రిటన్‌లో వీటిని రూపొందించగా, అవి మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయట.
- నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్ గార్డెన్‌లో ఉన్న తులిప్ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య పేరు పెట్టారు.
- సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఐష్ పెద్ద ఫ్యాన్. ఎప్పటికైనా ఆయనతో కలిసి నటించాలన్న తన కోరిక 'రోబో'తో నెరవేరింది.
- ఐష్‌కి క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. ఫ్రీ టైమ్‌లో బ్యాట్ పట్టుకుని సరదాగా ఆడుతుంటారు.
- బాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన 'రాజా హిందుస్థానీ' సినిమాలో హీరోయిన్ రోల్‌కు తొలుత ఐష్‌నే సంప్రదించారట. కానీ, ఆమె నిరాకరించడం వల్ల ఆ అవకాశం కరీష్మాకపూర్‌ను వరించింది.
- 2009లో ఐష్‌ను భారత ప్రభుత్వం 'పద్మ శ్రీ' అవార్డుతో సత్కరించింది. 2012లో ఆమెకు బ్రిటన్ ప్రభుత్వం 'ఆడ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్' పురస్కారాన్ని అందించింది.
- 2003లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా ఐష్ వ్యవహరించారు. ఈ రికార్డు సాధించిన తొలి భారతీయ నటి ఈమే కావడం విశేషం.
'మేం వచ్చేస్తున్నాం, మా నాన్నను ఆపడం కుదరదు'- ఐశ్వర్య ఫ్యామిలీకి అభిషేక్ షాకింగ్ సర్ప్రైజ్