భూగోళం మీద ఉనికి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి.. కదిలేది, పెరిగేది, పునరుత్పాదన చెందేది అయిన జీవపదార్థం. జంతువులు, మానవులు, చెట్టూచేమ ఈ కోవలోకి వస్తాయి. రెండోది ఎదగలేని, కదలలేని, పునరుత్పాదన చెందలేని నిర్జీవ పదార్థం. మానవ నిర్మిత యంత్రాలు, పరికరాలు, సామాన్లు వంటివి ఈ తరగతికి చెందుతాయి. మొత్తంగా చూస్తే, ప్రతిదీ ఈ రెండింటిలో ఏదో ఒక కోవలోకి వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు తరగతుల జీవ నిర్జీవ పదార్థాల్లోనూ ఇమిడిపోగల మరో మూడో తరగతి కూడా ప్రకృతిలో ఉంది. వైరస్ అనేదే ఈ ప్రత్యేక జాతి. దీన్ని కూడా సూక్ష్మజీవి లేదా సూక్ష్మప్రాణి (మైక్రోఆర్గానిజం లేదా మైక్రోబు) అని వ్యవహరిస్తారు.
వైరస్‌లు ఏం చేస్తాయి? ఎలా వృద్ధి చెందుతాయి? వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. యుగయుగాలుగా ఈ వైరస్‌లు మన ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాయి.. రకరకాల రోగాలకు కారణమవుతున్నాయి. ఈ అంటురోగ కారక క్రిములను సూక్ష్మదర్శిని ద్వరా మాత్రమే చూడగలం. సృష్టిలోని అన్ని ప్రాణుల్లోనూ అతి చిన్నవి ఇవే. ఆల్గే, బ్యాక్టీరియా, ఫంగి, ప్రొటోజోవా వంటి సూక్ష్మప్రాణులను సాధారణ సూక్ష్మదర్శనులతో చూడగలం. కానీ వీటిని దర్శించాలంటే ప్రత్యేకమైన అత్యాధునిక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉండాల్సిందే.
మైక్రోబులతో పోల్చితే భిన్నం..
వైరస్‌లు ఇతర మైక్రోబుల కంటే ఎలా భిన్నమైనవి? ఆల్గే, బ్యాక్టీరియా, ఫంగి, ప్రొటోజోవాలు తమంతట తామే జీవించగలవు. అందుకు అవసరమైన పోషకాలను నేల, నీరు, గాలి, సేంద్రియ వ్యర్ధ పదార్థాలు వంటి ఎలాంటి వనరుల నుంచైనా సమకూర్చుకుంటాయి. అదే వైరస్‌ల విషయానికి వస్తే.. అవి జంతుప్రాణులు, మొక్కజాతులు, మానవులు, ఇంకా ఇతర మైక్రోబుల జీవకణాల లోపల మాత్రమే అతిథులుగా జీవిస్తాయి, వృద్ధి చెందుతాయి.
నేల, నీరు, గాలి, సేంద్రియ వ్యర్థాలు వంటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ వైరస్‌లు తమంతట తాము ఎందుకు జీవించలేవన్నది ముఖ్యమైన ప్రశ్న. సమాధానం చాలా సులభం. వృద్ధికి దోహదపడే అంతర్గత యంత్రాంగం వీటికి ఉండదు. కాబట్టి, వృద్ధి చెందడం కోసం ఇవి తప్పనిసరిగా మరొక జీవకణం మీద ఆధారపడాల్సిందే. విచిత్రమైన ప్రకృతి ధర్మం కదా?
ఇతర జీవ కణాల్లోకి అతిథులుగా
వైరస్‌లు బతికి బట్టకట్టాలంటే అవి ముందుగా ఇతర జీవ కణాల్లోకి అతిథులుగా ప్రవేశిస్తాయి. ఆ తర్వాత అక్కడే మకాం వేసి సంఖ్యాపరంగా వృద్ధి చెందుతాయి. ఈ దశలోనే వైరస్ లక్షణాలు బయటపడతాయి. క్రమంగా.. ఆతిథ్య ప్రాణికి రోగం సంక్రమిస్తుంది.
వైరస్‌లతో ఉత్పన్నమైన అన్ని లక్షణాలూ ప్రమాదకరమైనవేనా? దీనికి సమాధానం వైరస్ వల్ల వచ్చే జబ్బును బట్టి ఉంటుంది. సాధారణ జలుబు కూడా వైరస్ వల్ల వచ్చేదే. మనకు తెలుసు, దీని లక్షణాలు స్వల్పంగానే ఉంటాయి. అదే, పోలియో, ఎయిడ్స్, దద్దు వంటి వ్యాధుల్లో లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. ఆతిథ్య కణాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యాధి ప్రాణాంతకమవుతుంది.
టీకా ఉత్పత్తిలో వైరస్
వైరస్‌లు అనగానే మనకు జబ్బులే గుర్తుకు వస్తాయి. ఆ వెంటనే భయం కమ్మేస్తుంది. బెంబేలు పడతాం. వైరస్‌ల వల్ల వచ్చే రోగాలకు నివారణ ఉందా లేదా అన్నది ఈ సందర్భంగా ఉదయించే అతి ప్రధానమైన ప్రశ్న.. దీనికి సమాధానం.. నివారణ సాధ్యమే అని చెప్పుకోవాలి. పోలియోనే ఇందుకు దృష్టాంతరం.. వ్యాక్సిన్ పుణ్యమా అని భూమండలం మీద ఈ మహమ్మారి క్రమేణా అంతరించిపోతోంది. టీకా మందుల ఉత్పత్తికి తిరిగి సంబంధిత వైరస్‌లే సాయపడతాయనడానికి ఇది చక్కటి ఉదాహరణ. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో పోలియో ఒక్కటే కాదు, మశూచి, దద్దు వంటి ప్రాణాంతక వైరల్ వ్యాధులు తోక ముడుస్తున్నాయి.
కొన్ని వ్యాధులు రాకుండా టీకా ఔషధాలు ఉన్నప్పటికీ, చాలా వాటికి ఇప్పటికీ వ్యాక్సీన్లు లేవు. మరి వైరల్ అంటురోగాలను ఎలా నివారించాలి?
వైరస్‌లు మనుషులకు ఎలా సంక్రమిస్తాయో అర్థం చేసుకుంటే వాటి నివారణ చర్యలు సమర్థవంతంగా పాటించగలం. అతిథి నుంచి అతిథికి గాలి ద్వారా, నీటి ద్వారా, ప్రత్యక్ష్య సంబంధం (డైరెక్ట్ కాంటాక్ట్) ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. లేదా వెక్టార్లు ( వైరస్‌ను లోపల పెట్టుకుని సంచరించే మధ్యవర్తి జీవులు) దీన్నివ్వాప్తి చేస్తాయి. సంక్రమణ తీరును బట్టి కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుని ప్రమాదం నుంచి తప్పించుకోగలం. సామాజిక దూరం పాటించడం వీటిలో మొట్టమొదటిది. శుభ్రమైన నీటినే తాగాలి. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. వెక్టార్ జీవజాతులను అదుపు చేయాలి. ఉదాహరణకు, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల విషయంలో దోమలు వెక్టార్లుగా ఉంటాయి. కాబట్టి దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలి.దోమకాటు నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి.