ఖాతా ధ్రువీకరణ ప్రక్రియను ట్విట్టర్ తిరిగి ప్రారంభించనుంది. యాక్టివ్ యూజర్లు, ప్రామాణికమైన వినియోగదారులు తమ ఖాతాలను ధ్రువీకరించుకొని 'బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్'ను పొందే వెసులుబాటు దక్కనుంది. ఈ ప్రక్రియ ఏకపక్షంగా, గందరగోళంగా ఉందని ఫీడ్‌బ్యాక్ అందిన కారణంగా ఖాతా ధ్రువీకరణను ట్విట్టర్ మూడేళ్ల క్రితం నిలిపివేసింది. తర్వాత పునరుద్ధరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అమెరికా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని పక్కనబెట్టింది.
తాజాగా ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. 2021 నుంచి ఈ వెసులుబాటు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. నూతన ధ్రువీకరణ పాలసీపై ఫీడ్‌బ్యాక్ అందించాలని వినియోగదారులను కోరింది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 8 వరకు తమ అభిప్రాయాలు పంపించవచ్చని తెలిపింది.
ఆరు రకాల ఖాతాలకు బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది ట్విట్టర్. ప్రభుత్వాలు, కంపెనీలు, బ్రాండ్లు-లాభాపేక్ష సంస్థలు, వార్తలు, వినోదం, క్రీడలు, కార్యకర్తలు, నిర్వాహకులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.
షరతులు!
అయితే ఈ కేటగిరీలతో పాటు ఖాతా ధ్రువీకరణకు అవసరమైన ప్రమాణాలను వచ్చే ఏడాది నాటికి గణనీయంగా పెంచనున్నట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. బ్లూ టిక్ పొందాలంటే ట్విట్టర్ ఖాతా యాక్టివ్‌గా, గుర్తించగలిగే విధంగా ఉండాలని పేర్కొంది. ఖాతా అసంపూర్తిగా ఉన్నా, యాక్టివ్‌గా లేకున్నా వెరిఫికేషన్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేసే ప్రతిపాదనపైనా కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. ట్విట్టర్ నియమాలను అతిక్రమించే ఖాతాలకు వెరిఫికేషన్‌ను రద్దు చేయడం లేదా తిరస్కరించడం చేస్తామని తేల్చిచెప్పింది.
"ట్విట్టర్లో చాలా వెరిఫైడ్ ఖాతాలు ఉన్నాయి. నిజానికి అన్ని ఉండాల్సింది కాదు. యాక్టివ్‌గా లేని, ప్రొఫైల్ అసంపూర్ణంగా ఉన్న ఖాతాలకు ఆటోమెటిక్‌గా వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను తీసివేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2021 నాటికి అదనపు ఖాతా వర్గాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది."
-ట్విట్టర్
ఖాతా ధ్రువీకరణ కోసం ఒక్క బ్లూ టిక్ మాత్రమే కాకుండా ఇతర మార్గాలను రూపొందిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. 2021లో కొత్త లేబుళ్లతో వ్యక్తులు తమను తాము ధ్రువీకరించుకోవచ్చని వెల్లడించింది.
ఇదీ చదవండి- 'అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం!'