ఉపగ్రహ ప్రయోగాలు.. ఖగోళ శాస్త్రజ్ఞులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయా? ఒకప్పటిలా గ్రహాలు, నక్షత్రాల కదలికలను జ్యోతిషులు సులువుగా పసిగట్టలేకపోతున్నారా? ఖగోళాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం.... ప్రైవేటు సంస్థలు వందల సంఖ్యలో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలే. ఫలితంగా ఏది గ్రహమో, ఏది నక్షత్రమో, ఏది ఉపగ్రహమో పోల్చుకోలేక ఖగోళ శాస్త్రవేత్తలు ఇబ్బంది పడుతున్నారు.
12,000 ఉపగ్రహాలతో 'స్పేస్ ఎక్స్'
భారీ ఉపగ్రహ మండల(మెగా కన్స్టెల్లేషన్) ఏర్పాటు దిశగా ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్ ఎక్స్' అంతరిక్ష సంస్థ ప్రయత్నిస్తోంది. 'స్టార్ లింక్' పేరుతో 12,000 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని నిర్దేశించుకుంది. వీటి ద్వారా 250 కోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. 2019 నవంబర్‌లో 60 ఉపగ్రహాలను దశలవారీగా అంతరిక్షంలోకి పంపడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆ సంస్థ 800 ఉపగ్రహాలను పంపింది.
3,000 ఉపగ్రహాలతో బెజోస్..
'స్పేస్ ఎక్స్' తరహాలోనే మరో ప్రముఖ వ్యాపార వేత్త, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్.. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమయ్యారు. 'బ్లూ ఆరిజన్' ప్రాజెక్టులో భాగంగా 'కైపెర్' పేరుతో 3,000 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.
ఇంతకీ సమస్య ఏంటి?
అయితే.. ఈ రెండు కంపెనీలు చేపట్టిన ఈ ప్రాజెక్టులను ఖగోళ శాస్త్రవేత్తలు ఏ మాత్రం స్వాగతించడం లేదు. ఈ ఉపగ్రహాలకు ఉండే సోలార్ ప్యానెళ్లు సూర్యరశ్మికి ప్రతిబింబించి, ఆకాశంలో వేగంగా కదిలే కాంతిప్రదేశాలుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా.. ఖగోళం గురించి అధ్యయనం చేసేటప్పుడు నక్షత్రాలుగా, గ్రహాలుగా కనిపిస్తున్నాయి. ఇటీవలే.. 'స్టార్‌లింక్'లోని ఉపగ్రహాలు ప్రయోగించిన కొద్దికాలంలోనే కక్ష్య నుంచి తప్పిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. వీటి వల్ల ఖగోళ శాస్త్రవేత్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరి పరిష్కారం లేదా?
స్పేస్ఎక్స్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. సూర్యరశ్మి తగలకుండా ఉపగ్రహాలకు ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా అవి కంటికి కనిపించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు 'బ్లూ ఆరిజన్' ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంకా తెలియలేదు.
ఇదీ చూడండి:మరో 60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్ఎక్స్