Elon Musk Spacex Satellites lost: ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ అంతరిక్ష సంస్థ.. అంతర్జాల సదుపాయాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈనెల 3న రాకెట్ ద్వారా 49 ఉపగ్రహాలను ప్రయోగించింది. స్పేస్‌ఎక్స్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టిన మరుసటిరోజే జియోమాగ్నటిక్ తుపాను ప్రభావం కారణంగా ఉపగ్రహాలు కక్ష్యనుంచి పడిపోయి గాలిలోనే మండిపోయాయి. సూర్యుని ఉపరితలంలో శక్తిమంతమైన పేలుళ్ల కారణంగా ఇలాంటి సౌర తుపానులు ఏర్పడతాయి. ఈ తుపానులు.., భూమిని తాకే సామర్థ్యమున్న ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలను వెదజల్లుతాయి.గతవారం ప్రయోగించిన 49 ఉపగ్రహాల్లో 40 వరకు ఈ తుపాను బారినపడ్డాయని స్పేస్‌ఎక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది.
స్పేస్‌ఎక్స్ తాజాగా పంపించిన ఈ 49 ఉపగ్రహాలను భూమికి 210 కిలోమీటర్ల ఎత్తులో మోహరించాలని భావించారు. మొదట ఈ ఉపగ్రహాలన్నీ నియంత్రిత స్థితిలోనే కక్ష్యలోకి చేరాయని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది. కానీ ఈ ప్రయోగం చేపట్టిన మరుసటి రోజే జియోమాగ్నటిక్ తుపాను భూమిని తాకిందని పేర్కొంది. నార్తర్న్ లైట్స్ తరహాలోనే ఈ తుపాను కూడా అదే రకమైన మెకానిజాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇది ప్రమాదకరమైన ప్రభావాలను చూపుతుందని తెలిపింది. ఈ తుపాను వాతావరణాన్ని వేడెక్కించడం సహా ఊహించిన దానికంటే ఎక్కువగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది. తుపాను తీవ్రత, వేగం కారణంగా గత ప్రయోగాల కంటే అట్మాస్మిరిక్ డ్రాగ్‌లో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు జీపీఎస్ వ్యవస్థ ద్వారా తెలిసిందని స్పేస్‌ఎక్స్ పేర్కొంది. ఆ సమయంలో.. శాటిలైట్లను సేఫ్ మోడ్‌లో ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించింది. ఉపగ్రహాలకు చెందిన ఏభాగం కూడా భూమి వరకు వస్తుందని అనిపించడం లేదని స్పేస్‌ఎక్స్ స్పష్టం చేసింది.
స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన ఈ ఉపగ్రహాలన్నీ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులో చేరాల్సి ఉంది. ఈ స్టార్ లింక్ కంపెనీ ద్వారా వేలాది ఉపగ్రహాలను ఉపయోగించి వేగవంతమైన అంతర్జాల సేవలను అందించాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ఖరీదైనదే అయినప్పటికీ తీగల ద్వారా కనెక్షన్లు లేని ప్రాంతాల్లో కూడా ఈ సేవలను పొందవచ్చని స్పేస్‌ఎక్స్ తెలిపింది.
ఇదీ చూడండి : ప్రపంచంలోనే భారీ పవర్ బ్యాంక్.. టీవీలు, వాషింగ్ మెషిన్లకూ...