ఇంట్లో పిల్లలో, మరీ పెద్దవాళ్లో ఉండి మనం బయటకు వెళితే చాలా కంగారుపడిపోతుంటాం. వారి భద్రత కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంటాం. బోలెడన్ని ఆప్షన్లతో వస్తున్న స్మార్ట్ డోర్‌బెల్స్‌తో (Smart doorbell) ఆ ఆలోచనకు చెక్ పెట్టొచ్చు. ఎక్కడున్నా మన ఇంటి కాలింగ్ బెల్ నొక్కిందెవరో తెలుసుకోవచ్చు. కావాలంటే మనం వాళ్లతో అక్కడినుంచే మాట్లాడొచ్చు కూడా.
స్మార్ట్ డోర్ బెల్‌ను ఇంట్లో వైఫైకి కనెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన యాప్‌ను మన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే సరి. కాలింగ్ బెల్ నొక్కగానే ఆ శబ్దం ఇంట్లో ఉన్నవాళ్లకు వినిపించడం సహా సమాచారం మన ఫోన్ ద్వారా తెలిసిపోతూ వీడియో కనిపిస్తుంది. తలుపు తీయకుండానే వాళ్లకు జవాబు ఇచ్చే ఈ సెక్యూరిటీ బెల్ బాగుంది కదూ!
ఈ వేరుసెనగ వింటుంది!
ఇక్కడున్న ఫొటో దేనిదో చెప్పగలరా అంటే.. 'మాకేమైనా కళ్లు కనిపించవా ఏంటి? వేరుసెనక్కాయా, అందులోని పప్పులూ' అనేస్తారు ఎవరైనా సరే. కానీ అక్షరాలా అది తప్పు సమాధానం. ఎందుకంటే ఆ ఫొటో మనం రోజూ పాటలు వినడానికో, ఫోను మాట్లాడ్డానికో వాడే ఇయర్‌ఫోన్స్‌ది. జపాన్‌కు చెందిన 'సూపర్‌మార్కెట్ కకమూ' అనే కంపెనీ వినూత్నమైన ఆలోచనతో ఈ 'పీనట్ ఇయర్‌ఫోన్స్'ను తయారుచేసింది. ఇయర్‌ఫోన్సే కాదూ.. వాటిని భద్రపరిచే కేసూ అచ్చుగుద్దినట్టు వేరుసెనక్కాయలానే ఉండేలా తీర్చిదిద్దింది. సరికొత్త రూపంతో గుటుక్కుమని నోట్లో వేసుకోవాలనిపించేలా ఉన్న ఈ ఇయర్‌ఫోన్స్ త్వరలో మార్కెట్లోకి రానున్నాయట!
ఇదీ చూడండి : MaskFone: ఈ మాస్క్‌తో పాటలు, మాటలు