ఎప్పుడూ మనతోనే ఉండే మన నీడ అప్పుడప్పుడూ మాయమవుతుందని తెలుసా... మే నెల 21న ఒడిశాలోని భువనేశ్వర్‌లో అలాగే జరిగింది. అవును... ఉదయం 11 గంటల 43 నిమిషాలకు నీడ పోయింది. అలా మూడు నిమిషాల పాటు మనుషుల నీడలే కాదు... వస్తువుల నీడలూ కనిపించలేదు. ఉన్నట్టుండి ఇలా నీడ మాయమవ్వడంతో జనాలంతా సరదాగా వస్తువుల్ని ఎండలో ఉంచి ఫొటోలు తీస్తూ ఆశ్చర్యపోయారు. నీడ కనిపించకుండా పోయిన ఈ రోజును ‘జీరో షాడో డే’ అంటారు. ఇప్పుడే కాదు, ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుంది. అసలు నీడ పోవడానికి కారణం ఏంటో తెలుసా...
సూర్యుడు నడినెత్తిమీదకు రావడం. మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిమీద ఉన్నాడని అంటాం కానీ నిజానికి ఉండడు. అయితే అలా కచ్చితంగా సూర్యుడు నడినెత్తిమీదకు ఏడాదిలో రెండుసార్లు మాత్రమే వస్తాడు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణించే సమయంలో ఒకసారి, దక్షిణాయనంలో ప్రయాణించేటప్పుడు రెండోసారి. ఆ సమయంలో సూర్యుడు కచ్చితంగా మనముండే ప్రాంతంలో నడినెత్తిమీద అంటే ‘జెనిత్’ పాయింట్‌లో ఉంటాడు. అందుకే ఆ సమయాల్లోనే నీడ మాయమైపోతుంది. అయితే ఇలా ప్రపంచవ్యాప్తంగా అవుతుందా అంటే... అవదు. కర్కాటక రేఖ, మకరరేఖ మధ్యలో ఉండే ప్రాంతాల్లోనే ఈ జీరో షాడో డేలు వస్తాయి. ప్రతిసారీ ఒకేరోజు, ఒకే సమయంలో ఇలా జరగదు. సాధారణంగా ఉత్తరాయణంలో మేలోనూ, దక్షిణాయనంలో ఆగస్టులోనూ వస్తుంటాయి. అందుకే ఆ నెలల్లో వేరు వేరు తేదీల్లో ఇలా నీడ పోతుందన్నమాట. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనూ ఏడాదికి రెండుసార్లు ఇలా నీడ కనిపించకుండాపోవడం మనం గమనించొచ్చు. నిజంగా ఇదో ఆశ్చర్యపరిచే సంగతే కదూ!
- ఇదీ చదవండి : కళాకారులను ఆదుకునేందుకు 'సాహో' థీమ్ వేలం