టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఆ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు రీల్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. ఇప్పటికే ఫొటో షేరింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ యాప్.. యూజర్లను ఆకట్టుకునేందుకు షార్ట్ వీడియో ఫార్మాట్లోనూ అడుగుపెట్టింది. భారతీయ విపణిలోనూ అధికారికంగా రీల్స్‌ను లాంచ్ చేసిందీ ఇన్‌స్టా. అయితే దీనికి దేశీయ యాప్‌లైన రొపోసో, మిత్రోన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
ఇన్‌స్టా రీల్స్...
రీల్స్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్. ఆగస్టు 5న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీచర్‌తోనే ఇన్‌స్టా యాప్‌లోనే చిన్నపాటి ఎంటర్టైనింగ్ క్లిప్‌లు క్రియేట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆడియో, వీడియో ఎఫెక్ట్ లైబ్రరీ ఆధారంగా 15 సెకన్ల వీడియోలను రూపొందించుకోవచ్చు. ఎడిటింగ్ కూడా యాప్‌లోనే చేసుకోవచ్చు. యూజర్ అకౌంట్ పబ్లిక్‌లో ఉంటే పోస్టు చేసిన వెంటనే వీడియో కోట్ల మందికి చేరిపోతుంది. భారత్‌లో అతిపెద్ద మార్కెట్‌ను కలిగిన టిక్‌టాక్‌పై ప్రభుత్వం నిషేధం కారణంగా ఆయా యూజర్లను ఆకర్షించాలని చూస్తోంది ఇన్‌స్టా.
అమెరికాలోనూ టిక్‌టాక్‌ను యాప్‌ను బ్యాన్ చేయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది. ఫలితంగా అక్కడ కూడా ఇదే ఫీచర్‌తో యూజర్లను మరింత ఆకట్టుకోవాలని భావిస్తోంది ఇన్స్టాగ్రామ్. అయితే ఈ బడా సంస్థకు భారతీయ సంస్థలు తయారు చేసిన రొపోసో, మిత్రోన్ వంటి యాప్‌లు ఊహించని పోటీనిస్తున్నాయి.
రొపోసో..
ఇప్పటికే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు, ప్లేస్టోర్‌లో 4.1 రేటింగ్‌తో దూసుకెళ్తోంది రొపోసో. అంతేకాకుండా యాపిల్ యాప్ స్టోర్‌లోనూ 4.4 రేటింగ్ సాధించింది. భారత్‌లోనే తయారైన ఈ యాప్.. హిందీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, పంజాబీ, తెలుగు సహా పలు స్థానిక భాషల్లో అందుబాటులో ఉంది.
యూజర్లు స్లో మోషన్, టైమ్ లాప్స్ వంటి ఎన్నో ఫీచర్లతో వీడియోలను క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆయా కంటెంట్‌ను వాట్సాప్‌లో స్టేటస్‌గా షేర్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కోసం ఆడియో లైబ్రరీ, ఎపెక్ట్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
మిత్రోన్..
చిన్న వీడియో కంటెంట్ క్రియేషన్‌లో ఈ యాప్ దూసుకెళ్తోంది. టిక్‌టాక్ బ్యాన్ తర్వాత దీనికి బాగా ఆదరణ పెరిగింది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు సాధించింది. ప్లేస్టోర్‌లో 3.9, యాపిల్ యాప్ స్టోర్‌లో 4.4 రేటింగ్ సాధించింది ఈ యాప్ సులభంగా, చదువుకోని వాళ్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇందులో వీడియో క్రియేట్ చేసి షేర్ చేయగలరు.
ఈ స్వదేశీ యాప్‌ల కన్నా ఇన్‌స్టా కాస్త ముందు ఉండటానికి కారణం ఇప్పటికే దానికి భారీ యూజర్లు కలిగి ఉండటం.
టిక్‌టాక్ ఉన్నప్పుడు యూజర్ల ఎంగేజ్మెంట్ దాదాపు ఇప్పటికన్నా రెండు రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. టిక్‌టాక్ లేకపోవడం వల్ల ఇన్‌స్టా ఎంచుకున్నారని.. ఒకవేళ భారత్ యాప్‌లు కూడా ఇన్‌స్టాను మరిపించగలిగితే ఇన్‌స్టాను వినియోగదారులు విడిచిపెట్టినా ఆశ్చర్యమేమి లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.