వాట్సాప్ ప్రవేశపెట్టిన నూతన ప్రైవసీ నిబంధనల కారణంగా టెలిగ్రామ్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగాయని కంపెనీ ప్రకటించింది. దీంతో జనవరి మొదటి వారానికి 500 మిలియన్ల యాక్టివ్ యూజర్ల మార్కును దాటినట్టు తెలిపింది. 3 రోజుల్లోనే 25 మిలియన్ల కొత్త వినియోగదారులు వచ్చి చేరారని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా..
ఆసియా నుంచి 38శాతం, ఐరోపా నుంచి 27శాతం, లాటిన్ అమెరికా నుంచి 21శాతం ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి 8శాతం మంది నూతనంగా వచ్చి చేరారని టెలిగ్రామ్ ప్రకటించింది. అయితే భారత్ నుంచి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.
''భారత్‌లో కేవలం జనవరి 6-10వ తేదీల మధ్య 15లక్షల యాప్ డౌన్లోడ్లు నమోదై ఉండవచ్చు.''
- సెన్సార్ టవర్ డేటా
''గతంలోనూ వేగవంతమైన డౌన్లోడ్లయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి కాస్త భిన్నం. సేవలు పొందే విషయంలో తమ గోప్యతపై రాజీపడేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నది వాస్తవం. గత ఏడేళ్లుగా వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తున్నాం.. కాబట్టే ఈ స్థాయిలో వృద్ధి నమోదవుతోంది.''
-టెలిగ్రామ్
అతిపెద్ద మార్కెట్.. భారత్..
2020అక్టోబర్ నాటికి 115కోట్ల మంది మొబైల్స్ కలిగిఉండగా.. 117కోట్ల డేటా వినియోగదారులతో ప్రపంచంలో భారత్ అతిపెద్ద టెలికామ్ మార్కెట్‌గా ఉంది. 2019నాటికే భారతీయులు సరాసరి డేటా వినియోగం 12జీబీగా ఉందని.. 2025నాటికి ఇది 25జీబీకి చేరుతుందని 'ఎరిక్సన్' అంచనా వేసింది.
''వ్యక్తిగత గోప్యతతో పాటు.. సులువైన మెసేజింగ్ సేవలందించే వాట్సాప్‌కు ప్రత్యామ్నాయ యాప్‌గా పరిగణిస్తుండటమే వేగవంతమైన డౌన్లోడ్లకు కారణంగా భావిస్తున్నాం. గత సంవత్సరం వరకు రోజుకు 15లక్షల మంది మా యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేవారు. ప్రస్తుత వేగంతో డౌన్లోడ్లు పెరిగితే త్వరలోలే కోటి వినియోగదారులను చేరుకుంటాం.''
-పావేల్ దురోవ్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ.
ఇతర యాప్స్ మాదిరి తామెవరికీ జవాబుదారీ కాదని.. మార్కెట్లు, భాగస్వాములు, ప్రకటనల వ్యాపారం నుంచి తమకు ఎలాంటి ఒత్తిడి లేవని పావేల్ దురోవ్ స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా వాట్సాప్ నూతన ప్రైవసీ నిబంధనలతో సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
మరోవైపు.. డేటా నిబంధనలు, ప్రైవసీ అతిక్రమణలను ఖండించిన వాట్సాప్.. తమ ప్రైవసీ నిబంధనలతో వినియోగదారుల భద్రతకు ముప్పు లేదని ఉద్ఘాటించింది.
ఇవీ చదవండి:
వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్... ఏది సేఫ్?
డేటా షేరింగ్‌పై 'వాట్సాప్' వివరణ