డబ్బులు లేకపోతే లేవులే అనుకోవచ్చు. కానీ అకౌంట్‌లో 1800 కోట్ల రూపాయలు ఉండి ఒక్క రూపాయీ వాడుకునే అవకాశం లేకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉంటుందా..? శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండే స్టీఫెన్ థామస్ పరిస్థితి అచ్చంగా ఇదే. కంప్యూటర్ ప్రోగామర్ అయిన అతడు పదేళ్ల కిందట ‘క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది’ అనే విషయం తెలుపుతూ ఓ వీడియో చేసినందుకుగానూ ఓ కంపెనీ అతడికి 7002 బిట్‌కాయిన్లను చెల్లించింది. వాటిని ఐరన్‌కీ డిజిటల్ వ్యాలెట్‌లో ఉంచి దాని పాస్‌వర్డ్‌ని ఓ కాగితం మీద రాసుకున్నాడట.

అప్పట్లో ఆ బిట్‌కాయిన్ల విలువ కొన్ని డాలర్లు మాత్రమే. అందుకే, ఆ కాగితాన్ని భద్రంగా దాయాలన్న ఆలోచన థామస్‌కి రాలేదు. దాంతో అదెక్కడో పోయింది. ఆ తర్వాత బిట్‌కాయిన్ల విలువ అమాంతం పెరిగిపోయింది. కానీ థామస్‌కి ఆ పాస్‌వర్డ్ ఎంతకీ గుర్తురాలేదు. ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న బిట్‌కాయిన్ల విలువ సుమారు రూ.1800కోట్లకు సమానం. ఆ ఖాతాను తెరవడానికి థామస్ ఇప్పటికి ఎనిమిదిసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. పదిసార్లు అలా విఫలమైతే ఆ డిజిటల్ వ్యాలెట్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. ఇక దాన్ని ఎవ్వరూ తెరవలేరు. బ్యాంకుల్లా ఈ క్రిప్టోకరెన్సీ ఖాతాలు ఎవరి అధీనంలోనూ ఉండవు. కాబట్టి అతడి డబ్బుని వెనక్కితెచ్చే మరో దారి లేనే లేదట. చూస్తూ చూస్తూ అంత డబ్బుని పోగొట్టుకోవడం అంటే ఎంత కష్టమో.!