మారుతున్న అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులకు చాటింగ్‌ను మరింత సులభతరం చేస్తూ వస్తోంది వాట్సాప్. ఇందుకోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. తాజాగా యూజర్స్ కోసం మరిన్ని మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి రాగా, మరికొన్ని బీటా యూజర్లకు వినియోగించేందుకు వీలుంది. మరి ఆ కొత్త ఫీచర్లేంటో చూసేద్దామా?
వేర్వేరు డివైజ్‌లలో ఒకే సారి..
వాట్సాప్ యూజర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫీచర్లలో మల్డీ డివైజ్ లాగిన్ ఒకటి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో లాగిన్ అవ్వాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌లో లాగిన్ అయ్యేందుకు మాత్రమే అవకాశం ఉంది.
త్వరలో అందుబాటులోకి రానున్న మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌తో ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్ అవ్వచ్చు. అలా ఒకేసారి మెసేజ్‌లను వేర్వేరు డివైజ్‌లలో చూసుకోవడం సహా, అంతకముందు మీరు మార్క్ చేసిన స్టార్ మెస్సేజ్‌లు, ఆర్కైవ్ చాట్స్ కూడా కొత్తగా లాగిన్ అయిన డివైజ్‌లో సింక్ అవుతాయి.
ఒకేసారి 50 మందితో వీడియో కాల్..
గూగుల్ మీట్, జూమ్ యాప్ తరహాలో వాట్సాప్ కూడా ఒక వీడియో కాల్‌లో ఒకే సారి 50 మందితో మాట్లాడుకునే ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. అలానే గ్రూప్ క్రియేట్ చేసి, ఇతరులను వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ నుంచి ఇన్‌వైట్ చేసుకోవచ్చు.
కొత్త ఎమోజీలు, యానిమేటేడ్ స్టిక్కర్లు
ఎమోజీలతో తమ భావాలను వ్యక్తపరిచే వారి కోసం కొత్తగా 138 ఎమోజీలను వాట్సాప్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఇవి వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చెఫ్, ఫార్మర్, పెయింటర్‌తో ఇతర వృత్తులకు చెందిన ఎమోజీలనూ ఇస్తున్నారు. అలానే కొత్తగా నాలుగు యానిమేటేడ్ స్టిక్కర్ ప్యాక్స్‌ను కూడా యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అడ్వాన్స్ సెర్చ్
ఎప్పుడో వాట్సాప్‌లో టైప్ చేసిన మెసేజ్, ఫొటో, వీడియో లేదా డాక్యుమెంట్ కావాలి. కానీ దానిని వెతకాలంటే అయ్యే పని కాదు. అందుకే వాట్సాప్ అడ్వాన్స్ సెర్చ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా యూజర్స్ గతంలో పంపిన మెసేజ్, ఫొటో, వీడియో, డాక్యుమెంట్లను సులభంగా వెతకొచ్చు.
పర్మినెంట్ మ్యూట్ ఆప్షన్
మనలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ వాట్సప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉండే ఉంటారు. వాటిలో కొన్ని మనం తరచుగా ఉపయోగించేవి అయితే, మరికొన్నింటిలో సభ్యులుగా ఉన్నప్పటికీ చురుగ్గా వ్యవహరించం. అటువంటి వాటిని మ్యూట్‌లో పెడుతుంటాం. అయితే మ్యూట్ ఫీచర్‌లో ఇప్పటి దాకా 8 గంటలు, ఒక వారం, ఏడాది పాటు మ్యూట్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఇక మీదట పూర్తిగా అంటే మీరు అన్‌మ్యూట్ చేసేవరకు గ్రూప్ నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్.
క్యూఆర్ కోడ్‌తో సులువుగా..
ఎవరైనా కొత్త వ్యక్తుల ఫోన్ నంబరు మన కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలంటే వాళ్ల ఫోన్ నంబర్, పేరు టైప్ చేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మనం ఏ వ్యక్తి ఫోన్ నంబర్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో వారి వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారి ఫోన్ నంబర్, పేరు మీ ఫోన్‌లో సేవ్ అవుతుంది.
డార్క్‌మోడ్
ఇప్పటి వరకు మొబైల్ వెర్షన్‌లో మాత్రమే డార్క్‌మోడ్ ఫీచర్ ఉంది. ఇక మీదట డెస్క్‌టాప్ వినియోగాదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ వెబ్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో థీమ్‌పై క్లిక్ చేస్తే డార్క్‌మోడ్ ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్‌గా డార్క్‌మోడ్‌లోకి మారిపోతుంది.

గ్రూప్ కాలింగ్
వాట్సాప్ గ్రూప్ కాలింగ్‌లో ఇప్పటి వరకు 8 మంది ఒకేసారి మాట్లాడుకునే సదుపాయం ఉంది. ఈ గ్రూప్ కాలింగ్‌లో ఎవరు మాట్లాడుతున్నా స్క్రీన్‌పై అందరి ముఖాలు ఒకే సైజులో కనిపిస్తాయి. దాని వల్ల ఎవరైతే మాట్లాడుతున్నారో వారిపై దృష్టిపెట్టడానికి అవకాశం ఉండదు. ఇక మీదట మాట్లాడే వ్యక్తిని హైలెట్ చేసే విధంగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది వాట్సాప్. ఇందు కోసం గ్రూప్ వీడియో కాల్‌లో మాట్లాడే వ్యక్తి విండోపై ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే వారి విండో పెద్దదిగా కనపడుతుంది. దాంతో మిగతావారి దృష్టి సదరు వ్యక్తిపైనే ఉంటుంది. అలానే గ్రూప్‌లో ఉన్న వారితో (ఎవరైనా ఎనిమిది మంది మాత్రమే) వీడియో కాల్ చేసేందుకు కొత్తగా వీడియో ఐకాన్‌ను యాడ్ చేసింది.
ఇదీ చూడండి:టిక్‌టాక్ కొనుగోలు రేసులో గూగుల్..!