సహజవనరుల అన్వేషణలో ముందుండే అమెరికా మరో అడుగు ముందుకేసింది. అంతరిక్షంలో ఖనిజాలను సేకరించడానికి రంగం సిద్ధం చేసుకునే పని ప్రారంభించింది. భూమికి దగ్గరగా ఉండే చంద్రుడి నుంచి ఆ పని మొదలుపెట్టబోతోంది. జాబిల్లిపై శిలలు, మట్టి కొంటానని, వాటిని అమ్మేవారుంటే ముందుకు రావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కోరింది. బిడ్లు దాఖలు చేసే వారు ఏ దేశానికి చెందిన వారైనా ఫర్వాలేదని, చంద్రుడిపైకి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు మాత్రం వారే పెట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ బిడ్‌ను గెల్చుకున్న వారు చంద్రుడిపైకి వెళ్లి శిలలు, మట్టిని సేకరించినా వాటిని భూమికి తీసుకురావాల్సిన అవసరం లేదు.
'అంతరిక్ష వనరుల సేకరణ, వాణిజ్యానికి అవసరమయిన నియంత్రణ - విధివిధానాలను నిర్దేశించుకోవాల్సిన సమయం వచ్చింది' అంటూ నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టైన్ పేర్కొన్నారు.
మరి కొనడమెందుకు?
శిలలు, మట్టిని భూమిపైకి తీసుకురావాల్సిన పని లేనప్పుడు వాటిని కొని ఏం చేస్తారన్నది ఆసక్తికరం. మున్ముందు జాబిల్లిపై వనరుల సేకరణకు చట్టపరంగా ఒక ప్రాతిపదిక ఏర్పర్చుకునేందుకు ఇది నాంది. భవిష్యత్తులో చంద్రుడిపై, అరుణగ్రహంపై ఆవాసాల ఏర్పాటుకు అక్కడి వనరులనే ఉపయోగించాలన్నది నాసా ఆలోచన. భవిష్యత్తు అంతరిక్ష కార్యక్రమాలకు కూడా అంతరిక్షంలోని వనరులనే ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం చంద్రుడిపై శిలలు, మట్టి సేకరించే కాంట్రాక్టుకు 15వేల డాలర్ల నుంచి 25వేల డాలర్ల వరకు చెల్లించాల్సి వస్తుందని నాసా అంచనా వేస్తోంది. బిడ్‌ను గెల్చుకున్న వారు చంద్రుడి ఉపరితలంపై నుంచి 500 గ్రాముల శిలలు, మట్టి సేకరించాల్సి ఉంటుంది. దాన్ని ఫొటో తీయాలి. ఏ ప్రాంతంలో సేకరించిందీ నమోదు చేయాలి. సేకరించిన వాటి యాజమాన్య హక్కులను నాసాకు బదిలీ చేయాలి. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ సహా ఆరు సంస్థలు పోటీ పడే అవకాశం ఉంది. నాసా కేవలం సేకరించిన మెటీరియల్‌కే డబ్బు చెల్లిస్తుంది. చంద్రుడిపైకి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చును బిడ్‌ను గెల్చుకున్న సంస్థే భరించాలి.
ఏప్రిల్‌లోనే శ్రీకారం
చంద్రుడు, ఇతర అంతరిక్ష వస్తువులపై ఖనిజాల తవ్వకాన్ని ప్రోత్సహించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సంతకం చేశారు. అంతరిక్ష కార్యక్రమం కింద చంద్రుడిపైకి మనుషులను పంపి అక్కడ దీర్ఘకాలం పాటు వనరులు అన్వేషించేందుకు వాణిజ్య భాగస్వాములను అనుమతిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తర్వాత తర్వాత అంగారకుడిపైకి మానవసహిత యాత్ర కూడా ఉంటుందని ఈ ఉత్తర్వులు పేర్కొన్నాయి. చంద్రుడిపై అమెరికా కన్ను వేయడానికి ప్రధాన కారణం కూడా చైనాయే అని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న రేర్ ఎర్త్ మెటల్స్‌లో దాదాపు 95శాతంపై చైనా నియంత్రణ ఉంది. దీంతో చంద్రుడిపై ఉన్న వనరులపై నియంత్రణ సాధించాలని అమెరికా భావిస్తోంది. చంద్రుడిపై ప్రధానంగా మూడు సహజవనరులు- గడ్డకట్టిన నీరు, హీలియం-3, రేర్ ఎర్త్‌మెటల్స్ ఉన్నాయి.
అంతర్జాతీయ ఒప్పందాల మాటేమిటి?
భూమికి వెలుపలి కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి ఔటర్‌స్పేస్-1967 ఒడంబడిక పరిధిలోకి వస్తాయి. అంతరిక్షంలో ఏ భాగంపైన అయినా ఏ దేశమూ ప్రత్యేకంగా సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి వీల్లేదని ఈ ఒడంబడిక స్పష్టం చేస్తోంది. అంటే ఏ దేశానికీ ప్రత్యేక హక్కులు ఉండవు. అక్కడ సైనిక స్థావరాలు ఏర్పర్చుకోవడానికి వీల్లేదు. అణ్వాయుధాలు ఉపయోగించడానికి వీల్లేదు. అయితే ఖనిజతవ్వకాల గురించి ప్రస్తావన ఈ ఒడంబడికలో లేదు. 1979 నాటి మూన్‌ట్రీటీ.. అంతరిక్షంలో ఖనిజాలు తవ్వకుండా నిషేధిస్తోంది. అయితే ఈ ఒడంబడికను అమెరికా సహా, అంతరిక్ష యాత్రలు చేపట్టే దాదాపు ఏ దేశం కూడా గుర్తించలేదు. దీంతో ఈ ఒడంబడికకు పెద్దగా విలువ లేదు.