దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ సరికొత్త మొబైల్స్‌తో మార్కెట్లోకి త్వరలో అడుగుపెట్టబోతోంది. 'ఇన్' సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను తీసుకురాబోతున్నట్లు కంపెనీ ఇది వరకే తెలిపింది. తాజాగా వాటిని తీసుకురాబోయే తేదీని వెల్లడించింది. నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు 'ఇన్' సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఆ కంపెనీ ఓ టీజర్‌ను పంచుకుంది. వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అయితే.. ఎన్ని ఫోన్లు తీసుకురాబోతున్నారు? ధర ఎంత ? వంటి వివరాలేవీ వెల్లడించలేదు.
రూ.7వేల నుంచి రూ.25వేల బడ్జెట్ మధ్య ఈ ఫోన్లను తీసుకురానున్నట్లు కంపెనీ సీఈఓ రాహుల్ శర్మ ఓ సందర్భంలో వెల్లడించారు. అలాగే, ఫోన్లలో ఎలాంటి యాడ్స్ ఉండబోవని, బ్లాట్ వేర్ కూడా ఉండదని కంపెనీ చెబుతోంది. వ్యక్తిగత డేటా సేకరించబోమని హామీ ఇస్తోంది.
భారత్-చైనా మధ్య ఘర్షణ వాతావరణం, వ్యక్తిగత డేటా భద్రత వంటి అంశాలపై చర్చ జరుగుతున్న వేళ మైక్రోమ్యాక్స్ రీ ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చూడండి: పబ్‌జీ మళ్లీ వచ్చేస్తోంది..!