New 12 Rockets Set To Launch In 2024 : జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ ఇచ్చిన ప్రేరణతో ప్రపంచ దేశాలు మరిన్ని పరీక్షలకు సిద్ధమయ్యాయి. నెలరాజు గుట్టువిప్పేందుకు 2024 ఒక్క సంవత్సరంలోనే దాదాపు 12 ప్రయోగాలు జరగనున్నాయి. చంద్రుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఒక్క ఏడాదిలో జరిగే అత్యధిక ప్రయోగాలు ఇవే. జనవరి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా మూడు ప్రయోగాలు జరగనున్నాయి.
అందరికంటే ముందుగా జపాన్
వచ్చే ఏడాదిలో జనవరి 19న జపాన్ అందరికంటే ముందుగా జాబిల్లిపై అడుగుపెట్టేందుకు ప్రయోగం చేపట్టనుంది. SLIM మిషన్‌ను ప్రయోగించి విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన ఐదో దేశంగా నిలవాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాకు చెందిన యునైటెడ్ లాంచ్ అలయన్స్ సంస్థ కూడా ఆస్ట్రోబోటిక్ పెరెగ్రైన్ లూనార్ ల్యాండర్‌ను జనవరిలోనే ప్రయోగించాలని నిర్ణయించింది. చైనా తన చాంగ్ ఈ-6 మిషన్‌ను మే నెలలో చేపట్టనుంది. 2020లో చైనా చేపట్టిన చాంగ్ ఈ-5 విజయవంతంగా చందమామ ఉపరితలంపై దిగింది. చాంగ్ ఈ 5 సేకరించిన శాస్త్రీయ నమూనాలను తిరిగి చాంగ్ ఈ6తో చంద్రునిపైకి డ్రాగన్ పంపనుంది.
9వేల కిలోమీటర్ల దూరంలో
మానవులను జాబిల్లికి తీసుకెళ్లే ఆర్టెమిస్ 2 మిషన్‌ను అమెరికా నవంబరులో చేపట్టనుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి, 2026 లేదా 2027లో తిరిగి భూమికి రానున్నారు. ఏరియన్ 6 ప్రయోగం కూడా అదే ఏడాది(2024) మధ్యలో ఐరోపా చేపట్టే అవకాశం ఉంది.
న్యూ గ్లెన్ వర్సెస్ స్పేస్‌ఎక్స్
మరోవైపు ప్రైవేట్ సంస్థలు కూడా చంద్రునిపై ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన న్యూ గ్లెన్ ప్రయోగం కూడా చంద్రుడి కక్ష్యను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ కూడా 2024లో ప్రయోగానికి సిద్ధమైంది.
మిషన్‌లకు అనుకూలంగా రిలే ఉపగ్రహం
మరోవైపు పెద్ద పెద్ద ప్రయోగాల మధ్య అనేక చిన్న ఫ్లైబైలు, ఆర్బిటర్లు, ల్యాండర్ల ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భవిష్యత్తులో జరిగే మిషన్‌లకు అనుకూలంగా ఉండేందుకు చైనా ఒక రిలే ఉపగ్రహాన్ని పంపుతోంది. జపాన్ ఫ్లైబైను పంపేందుకు సిద్ధంగా ఉంది. తన వైపర్ రోవర్‌ను చంద్రుని దక్షిణ ధ్రువానికి నాసా పంపనుంది. అంతరిక్ష రంగంలో వచ్చే ఏడాది కూడా భౌగోళిక రాజకీయ పురోగతిని కొనసాగించే అవకాశం ఉంది. అంతరిక్ష అన్వేషణకు, ముఖ్యంగా జాబిల్లిపై ప్రయోగాలకు సంబంధించి అమెరికా రూపొందించిన ఆర్టెమిస్ ఒప్పందంలో భారత్ భాగమైంది. ఈ ఒప్పందంలో మరిన్ని దేశాలు ఆ ఏడాది(2024లో) చేరే అవకాశాలు ఉన్నాయి.
'చంద్రుడిపై నుంచి రాళ్లు తీసుకురావడమే టార్గెట్- అది అంత ఈజీ కాదు'
'2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి- 2025లో ఇండియన్ స్పేస్ స్టేషన్ ప్రారంభం!'