Whatsapp security: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ గల మెసెంజర్ వాట్సాప్. వందల కోట్ల మంది వినియోగదారులున్న ఈ మాధ్యమం ద్వారా క్షణాలోనే బోలెడంత సమాచారాన్ని పంపొచ్చు. చాటింగ్‌తో పాటు ఆడియో కాల్, వీడియో కాల్ వంటి సదుపాయాలు ఉంటాయి. వాట్సాప్ సంభాషణ చాలా సురక్షితం. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ వల్ల మన సందేశాలు ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. ఇతర సామాజిక మధ్యమాలతో పోల్చితే వాట్సాప్ చాలా సేఫ్ అంటారు. అయితే ఇంత భద్రత ఉన్నా.. వాట్సాప్‌లో మన వ్యక్తిగత సంభాషణలు, ఎవరితో చాట్ చేస్తున్నాం అనే విషయాలు మరొకరికి తెలుస్తాయంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి ఇది సాధ్యమవుతుంది కూడా. మన రహస్య సందేశాలను మరొకరు సులభంగా తెలుసుకునే ఛాన్స్ ఉంది. అయితే అది మనం పొరపాటు చేస్తేనో, నిర్లక్ష్యంగా ఉంటేనో మాత్రమే సాధ్యమవుతుంది. మరి దీన్ని నుంచి ఎలా బయటపడాలి, ఇతరుల మన మేసేజ్‌లు చూడకుండా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్ వెబ్: వాట్సాప్ వెబ్ ఫీచర్ ద్వారా మన ఖాతాను ల్యాప్‌టాప్, కంప్యూటర్లో బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. దీని వల్ల ఇతరులు మన సందేశాలు సులభంగా చదవగలరు. మనం ఒక డివైజ్‌లోకి లాగిన్ అయ్యి పొరపాటున మర్చిపోయినా, లేదా మన ఫోన్‌ను వేరేవాళ్లకు ఇచ్చినా వారు సులభంగా వాట్సాప్ వెబ్ ద్వారా సందేశాలన్నీ చదువుతారు. మన సంభాషణలు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని చూస్తారు.
ఎలా తెలుసుకోవాలి?: మన పర్సనల్ చాట్‌ను ఇతరులు చదువుతున్నారో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఇందుకు వాట్సాప్‌లో ఓ ఫీచర్ ఉంది. మన ఫోన్లో వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లింక్డ్ డివైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మన ఖాతా వేరే డివైజ్‌లలో లాగిన్ అయి ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ వేరే చోట లాగిన్ అయి ఉంటే మీరు వెంటనే ఫోన్ నుంచే లాగౌట్ చేయొచ్చు. ఇలా ఇతరులు మన చాట్‌ను చూడకుండా జాగ్రత్తపడవచ్చు. అందుకే అప్పుడప్పుడు ఈ ఆప్షన్‌ను చెక్ చేసుకోవడం మంచిది.
Whatsapp hack: అలాగే మన వాట్సాప్ నంబర్‌తో ఇతరులు కూడా వేరే ఫోన్లలో లాగిన్ కావచ్చు. కాకపోతే యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కచ్చితంగా మన ఫోన్ నంబర్‌కు వచ్చే వెరిఫికేషన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకే అలాంటి కోడ్లు వచ్చినప్పుడు ఎవరు అడిగినా చెప్పకపోవడం మంచిది. లేకపోతే వేరే ఫోన్ నుంచి మన వాట్సాప్ సందేశాలను రహస్యంగా తెలుసుకునే ప్రమాదం ఉంటుంది.
ఇదీ చదవండి: వాట్సాప్‌లో 'డిజీలాకర్'.. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ ఇలా...