internet of things: ఆధునిక మానవ జీవితాలను కట్టి పడేసిన అంతర్జాలం ఇప్పుడు వస్తుజాలంగానూ విస్తరిస్తోంది. ఇంట్లోని బల్బులు, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వంటి వాటి దగ్గర్నుంచి బయట కార్లు, యంత్రాల వరకూ సమస్త వస్తు సామ్రాజ్యాన్ని ఏకం చేసే దిశగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల పరికరాలు ఐఓటీతో అనుసంధానం కాగా 2023 కల్లా వీటి సంఖ్య 320 కోట్లకు ఎగబాకనుందని అంచనా. ఐదో తరం మొబైల్ కమ్యూనికేషన్.. అదే 5జీ రాక దీనికి ఎక్కడలేని ఊపునిస్తోంది. ప్రస్తుత ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ల కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో 5జీ పనిచేస్తుంది మరి. మనదేశంలో ఈ ఏడాది చివర్లో 5జీ సేవలు ఆరంభమవుతున్న నేపథ్యంలో ఐఓటీ కొత్త పుంతలు తొక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది?
- మీరు కారులో ప్రయాణిస్తున్నారు. ఇంజిన్‌లో ఏదో సమస్య వచ్చింది. కారు దాన్ని గుర్తించి, తనే మెకానిక్ అపాయింట్‌మెంట్ తీసుకుంది. కారును తయారీచేసిన సంస్థకూ వర్తమానం పంపింది. ఇతర ఇంజిన్లలోనూ ఇలాంటి సమస్య తలెత్తిందేమో చూడమని చెప్పింది.
- ఆఫీసు నుంచి ఇంటికి వచ్చారు. పని ఒత్తిడితో ఏదో ఆందోళనలో ఉన్నారు. మీ పరిస్థితిని గమనించిన స్మార్ట్ ఇల్లు శ్రావ్యమైన సంగీతాన్ని ప్లే చేసింది. తలుపు దాటి వెళ్తున్నప్పుడు కళ్లకు హాయి కలిగించేలా లైట్ల వెలుగును తగ్గించింది.
- కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు వంటివి అయిపోతున్నాయని ఫ్రిజ్ సందేశం పంపింది. అంతేకాదు, తనకు తానే వాటిని కొనటానికి ఆర్డర్ పెట్టింది.
- మీరు నిద్రలేచిన సంగతిని గుర్తించిన కాఫీ మేకర్ వెంటనే కాఫీ కాయటం మొదలెట్టింది.
- ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. ఇవే నిజమైతే? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. అదే వస్తుజాలం ఇలాంటి కొత్త ప్రపంచాన్నే సృష్టించనుంది. ఇది అందుబాటులోకి వస్తే వస్తువులు, పరికరాలు ఒకదాంతో మరోటి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ ‘మాట్లాడుకుంటాయి’. తమకు తామే నిర్ణయాలు తీసుకొని, అమలు చేస్తాయి కూడా.
మనుషులను దాటి..: చాలాకాలంగా అంతర్జాలం కేవలం మనిషికి మనిషికి మధ్య సంబంధించిన పనులకే పరిమితమైంది. ఉదాహరణకు- ఫేస్‌బుక్‌ను తెరిచామనుకోండి. పోస్టులను చూడటానికి ఫేస్‌బుక్‌కు నోటిఫై చేయాలని బ్రౌజర్‌కు చెబుతామన్నమాట. ఫేస్‌బుక్ ఆ సమాచారం మొత్తాన్ని బ్రౌజర్‌కు పంపిస్తుంది. అప్పుడు పోస్టులు కనిపిస్తాయి. వాట్సప్‌లో లాగిన్ అయినా అంతే. వాట్సప్‌కు కనెక్ట్ చేయాలని యాప్‌కు చెబుతున్నామనే. వాట్సప్ మీద ఉన్న అందరికీ మనం ఆన్‌లైన్‌లో ఉన్నామని తెలియజేస్తుంది. మెసేజ్ పంపించినప్పుడు వాట్సప్ ద్వారా వెళ్తుంది. మెసేజ్ అందుకునేవారికి దాన్ని చేరవేస్తుంది. ఇలా ఇంటర్నెట్‌లో ఏ పనైనా మనమే ఆరంభిస్తాం. అందువల్ల ప్రస్తుత ఇంటర్నెట్‌ను ‘మనుషుల ఇంటర్నెట్’ అనుకోవచ్చు. డేటాను సృష్టించటం, మార్చటం, పంపించటం, స్వీకరించటం, చెరపటం వంటివన్నీ మనుషులు చేసేవే. అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పెద్దగా మనుషుల ప్రమేయమేమీ ఉండదు. ఇది వస్తువుల మధ్య నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది. పడకగదిలో స్మార్ట్‌లైట్ దగ్గర్నుంచి అధునాత ఫ్యాక్టరీ పరికరాల వరకూ దేన్నయినా కనెక్ట్ చేస్తుంది. పరికరాల మధ్య సమాచారాన్ని మార్పిడి చేస్తుంది. వీటికి స్మార్ట్‌గా నడుచుకునే సామర్థ్యాలను కలగజేస్తుంది. వాటంతటవే పనిచేసేలా, విశ్లేషించుకునేలా, నియంత్రించుకునేలా చేస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో కీలకమైంది ఇదే.
ఎలా పనిచేస్తుంది?: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పనిచేయటానికి మూడు అంశాలు అవసరం. 1. పరికరాలను ఒకదాంతో మరోటి అనుసంధానం చేసే మార్గం. 2. ఇతర పరికరాల నుంచి సమాచారాన్ని సేకరించే పద్ధతి. 3. డేటాను విడమరచుకొని, నిర్ణయాలు తీసుకునే విధానం. పరికరాలను ఒకదాంతో మరోటి అనుసంధానం చేయటంలో సెన్సర్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి తమ స్థితిని ఇతర పరికరాలకు చేరవేస్తాయి, అవన్నీ కలిసిపోయేలా నెట్‌వర్క్‌ను సృష్టిస్తాయి. ఒకసారి మనం వీటిని సెట్ చేసి పెడితే చాలు. వాటంతటవే పనిచేస్తాయి. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ, నిర్ణీత పనులను చేసేస్తాయి. తీగలతో అనుసంధానమై పనిచేసే ఐఓటీ పరికరాలు ఉన్నప్పటికీ.. చాలా పరికరాలు వైఫై ద్వారానే ఇంటర్నెట్‌తో కలుస్తాయి. దగ్గర్లోని పరికరాలైతే బ్లూటూత్‌తోనూ జత కూడొచ్చు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. పరికరాలు అనుసంధానమైనా వాటి భాష (కోడ్) ఒకటైతేనే 'మాట్లాడుకోగలవు'. అంటే అందిన సమాచారాన్ని డీకోడ్ చేసుకోగలవు. కానీ పరికరాల భాషలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవటం కష్టం. అందుకే ఇవన్నీ ఐఓటీ వేదికల (ఇంట్లో వాడుకునే స్మార్ట్‌హోం హబ్ వంటివి) మీద ఆధారపడతాయి. వివిధ టూల్స్‌తో కూడిన ఇవి ఆయా పరికరాల నుంచి అందే సమాచారాన్ని అర్థం చేసుకునే విధంగా మార్చి అందజేస్తాయి. ఒకరకంగా వీటిని ‘దుబాసీ’లని అనుకోవచ్చు. వీటిల్లో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇది నెట్‌వర్క్ డేటాను విడమరచి, ప్రసారం చేస్తుంది. ఐఓటీ వేదికల్లో యూజర్-ఫేసింగ్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఇది మనం ఆయా పరికరాలతో అవసరమైన పనులు చేయించుకోవటానికి తోడ్పడుతుంది.
ఇప్పటికే వాడుతున్నాం?: నాలుగో తరం పారిశ్రామిక విప్లవంలో ఐఓటీయే కీలకం కానుంది. పదే పదే ఒకేరకం పనులు అవసరమైన పరిశ్రమల్లో ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. మనుషుల ప్రమేయమీలే లేకుండానే పనులను పూర్తి చేయొచ్చు. రోబో రంగంలోనూ ఐవోటీ అద్భుతాలు సృష్టించనుంది. నిజానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను మనకు తెలియకుండానే ఇప్పటికే చాలా రకాలుగా వాడుకుంటున్నాం.స్మార్ట్ బల్బుల వంటి స్మార్ట్ హోం పరికరాలు ఇలాంటివే. సెన్సర్లు, టైమర్లు, ట్రిగ్గర్లతో ఇవి ఒకదాంతో మరోటి అనుసంధానమై ఆటోమేట్‌గా పనిచేస్తున్నాయి. ఈమెయిళ్లకు వాటంతటవే సమాధానాలు ఇచ్చేలా చూసే ఆప్షన్లు ఒకరకంగా ఐవోటీ రూపాలే. ఆరోగ్యరంగం, వైద్య పరికరాల్లోనూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. రోగుల సంరక్షణ, వారి ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టటం, స్మార్ట్ సర్జరీలు, జబ్బులను ముందే గుర్తించటం, రోబోల సాయం తీసుకోవటం వంటి వాటిని ఇప్పటికే గమనిస్తున్నాం. రక్తనాళంలోకి మందులను పంపించే ఐవీ ఫ్యూజన్ పంప్‌నూ పరిశోధకులు రూపొందించారు. దీన్ని దూరం నుంచే పనిచేసేలా చేయొచ్చు. వైఫైతో అనుసంధానమయ్యే పేస్‌మేకర్లు ముందుగానే గుండెపోటు ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరిస్తున్నాయి కూడా.
ఎనలేని ప్రయోజనాలు: మనం చేయలేని పనులెన్నో వస్తుజాలం చేయగలదు. వీటితో సామర్థ్యం, సౌకర్యం ఇనుమడిస్తాయి. అంతేకాదు, కొన్నిచోట్ల భద్రత కూడా చేకూరుతుంది.
వేగంగా డేటా విశ్లేషణ: మనుషుల మధ్య సాగే వ్యవహారాల మధ్య చాలా జాప్యం నెలకొంటుంది. ఉదాహరణకు- మనం ఎవరికైనా మెయిల్ పంపామనుకోండి. వాళ్లు దాన్ని ఎప్పుడు చదువుతారో, ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఎప్పుడు జవాబిస్తారో కచ్చితంగా చెప్పలేం. అదే యంత్రాలైతే మనకన్నా వేగంగా వెంటనే విశ్లేషించి, జవాబు ఇచ్చేస్తాయి. కొన్ని ఛాట్‌బోట్లలో ఇలాంటి పనితీరును ఇప్పటికే అనుభవిస్తున్నాం.
డేటా నిర్వహణ మెరుగ్గా: నిర్దేశించిన పనులు చేయటానికి అన్ని వనరులనూ వినియోగించుకునేలా పరికరాలను తయారుచేస్తారు. అందువల్ల అవి ఎల్లప్పుడూ ఆ పనుల్లోనే ఉంటాయి. మనకైతే ఎన్నో పనులు. వీటిల్లో పడిపోయి తేలికగా మరచిపోతాం. పరికరాలు మరచిపోవు. వెంటనే చేసేస్తాయి.
అన్నీ ఆటోమేట్: వాటంతటవే నిర్ణీత వేళల్లో, అవసరమైనప్పుడు అవసరమైన పనులు చేసేలా పరికరాలను తీర్చిదిద్దొచ్చు. వర్షం పడుతున్నట్టు వెదర్ సెన్సర్ గుర్తించగానే తోటలో నీళ్లు వెదజల్లే పరికరం ఆగిపోతే ఎంత బాగుంటుంది? ఇంట్లో ఎవరైనా జబ్బు పడితే వెంటనే ఎస్‌ఎంఎస్ అందితే ఎలా ఉంటుంది? మున్ముందు స్వయంచాలిత వాహనాలు ఒకదాంతో మరోటి మాట్లాడుకుంటూ ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తే? పట్టణంలోని ఎలక్ట్రిక్ పరికరాలకు గ్రిడ్ డేటా అందే అవకాశం ఉండి, తక్కువ విద్యుత్తు వాడుకునే సమయంలోనే పనిచేస్తే? ఇలా ఏ పరికరమైనా తనకు తానుగా నిర్ణయం తీసుకొని, దానంతటదే పనిచేసేలా సెట్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో కొన్ని సవాళ్లు లేకపోలేదు.
డేటా భద్రతకు ముప్పు: పరికరాల మధ్య నెట్‌వర్క్‌ను అడ్డుకొని, హైజాక్ చేసే అవకాశం లేకపోలేదు. ఇంటి ఉష్ణోగ్రతను నియంత్రించే పరికరాలు హైజాక్ అయినా అంత ఇబ్బందేమీ ఉండదు గానీ వైద్య పరికరాల పనితీరును మారిస్తే ప్రమాదమే. కాబట్టి ఐఓటీ భద్రత పెద్ద సమస్యగా పరిణమించొచ్చు. వ్యక్తిగత సమాచార గోప్యతకూ ప్రమాదం ముంచుకు రావచ్చు.
పరికరాల్లో లోపాలు: సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు బగ్స్ పెద్ద సమస్య. డేటా సేకరణ, డేటా ప్రాసెసింగ్‌లో బగ్స్ చొరపడితే పెద్ద వ్యవస్థల్లో చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. నెట్‌వర్క్ క్రాష్ అయినా తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
ఇవీ చదవండి: ఫొటో ఎడిటింగ్, ఫైల్ కన్వర్షన్.. అన్నీ టెలిగ్రామ్లోనే! ఈ 'బాట్స్'ను ట్రై చేయండి!!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. చాట్ లిస్ట్‌లోనే స్టేటస్.. గ్రూప్ కాలింగ్‌లో మ్యూట్ ఆప్షన్