Whatsapp Call Recorder: మామూలు కాల్స్ మాదిరిగానే ఇప్పుడు వాట్సాప్ కాల్స్ సైతం బాగా ఆదరణ పొందాయి. ఒక్క ట్యాప్‌తో ఇట్టే కాల్ చేసుకోవచ్చు. కానీ వాట్సాప్ కాల్స్‌ను మన ఫోన్‌లో రికార్డు చేసుకోవటానికి లేదు. మనం మాట్లాడే మాటలు తప్ప అవతలి వారి మాటలు రికార్డు కావు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో 'క్యూబ్ ఏసీఆర్' అనే కాల్ రికార్డర్ యాప్‌తో తేలికగానే సాధించొచ్చు. ఇది వాట్సాప్ వాయిస్ కాల్స్‌ను రికార్డు చేసి ఫోన్ స్టోరేజీలో సేవ్ చేస్తుంది. అయితే అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా వారి మాటలను రికార్డు చేయటం తగదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే వాట్సాప్ కాల్స్‌ను రికార్డు చేసే ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండకపోవచ్చు. దీన్ని సపోర్టు చేసే ఫోన్ ఉన్నట్టయితే ప్రయత్నించి చూడొచ్చు.
- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్యూబ్ ఏసీఆర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఈ యాప్‌ను ఓపెన్ చేసి అలాగే రన్ అవుతుండేలా చూడాలి.
- వాట్సప్‌ను ఓపెన్ చేసి వాయిస్ కాల్ చేయాలి.
- ఒకవేళ క్యూబ్ ఏసీఆర్ దానంతటదే రికార్డు చేయటం మొదలెట్టకపోతే, ఆ యాప్‌ను ఓపెన్ చేసి 'ఫోర్స్ వీఓఐపీ కాల్ యాజ్ వాయిస్ కాల్' ఎంచుకోవాలి. తర్వాత వాట్సప్ కాల్‌ను మళ్లీ చేయాలి.
ఐఫోన్‌లో అయితే..
ఐఫోన్‌లో వాట్సప్ కాల్స్ అనే కాదు, మామూలు కాల్స్‌నూ రికార్డు చేయలేం. కాల్స్ రికార్డు కోసం కొన్ని యాప్స్ ఉన్నా అంత సమర్థంగా పనిచేయవు. ఫోన్ యాప్‌లో కఠినమైన నిబంధనలే దీనికి కారణం. అయినా ఒక మార్గం లేకపోలేదు. కాకపోతే దీనికి మ్యాక్ తోడు కావాలి.
- కేబుల్‌తో ఐఫోన్‌ను మ్యాక్‌కు కనెక్ట్ చేయాలి. ఐఫోన్ తెర మీద కనిపించే 'ట్రస్ట్ దిస్ కంప్యూటర్' ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి.
- మ్యాక్‌లో కీబోర్డు మీద కమాండ్, స్పేస్‌బార్ రెండు బటన్లను కలిపి నొక్కాలి. అప్పుడు స్పాట్‌లైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్విక్‌టైమ్ ప్లేయర్‌ను వెతకాలి.
- ఫైల్ ఆప్షన్‌లోకి వెళ్లి 'న్యూ ఆడియో రికార్డింగ్'ను ఎంచుకోవాలి.
- ఐఫోన్‌ను ఆప్షన్‌గా ఎంచుకొని, యాప్‌లో రికార్డు బటన్‌ను నొక్కాలి.
- ఇప్పుడు ఐఫోన్ నుంచి వాట్సప్ కాల్ చేయాలి.
- మాట్లాడటం పూర్తయ్యాక క్విక్‌టైమ్‌లో రికార్డింగ్‌ను ఆపేయ్యాలి. ఈ ఆడియో ఫైలును మ్యాక్‌లో సేవ్ చేసుకోవచ్చు.
ఇవీ చూడండి: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టొచ్చా? అలాగే వాడొచ్చా? మీ డౌట్స్‌కు సమాధానాలు ఇవిగో!