How to find Second Hand Phone Full Details Use CEIR : నేటి ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఈ స్మార్ట్ఫోన్లు పొగొట్టుకుంటున్న వారు కూడా చాలా మందే ఉంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లు కుప్పలు తెప్పలుగా అమ్ముతుంటారు. అయితే.. కొంతమంది కొత్త మొబైల్ ఫోన్‌ని ఎక్కువ ధరకు కొనే బదులుగా తక్కువ ధరకే వస్తుందని సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ల(Smart Phones)ను కొంటుంటారు. ఇలాంటి వాటిని కొనేముందు అన్ని వివరాలూ తెలుసుకొని తీసుకుంటేనే మేలు.. లేదంటే ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి.. ఎవరి వద్దనైనా వాడిన మొబైల్ (సెకండ్ హ్యాండ్ ఫోన్) కొనే ముందు దానిని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలా కాదని ఏం ఆలోచించకుండా మొబైల్ కొంటే ఆ తర్వాత మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. అందుకే.. మీరు కొనుగోలు చేసే మొబైల్ మంచిదా..? కాదా, అసలు ఒరిజినలేనా..? అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అది ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
How to use CEIR Website in Telugu : డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ).. జనాలు పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్‌లను ట్రాక్ చేసేందుకు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్ ద్వారానే.. మీరు కొనాలనుకుంటున్న సెకండ్ హ్యాండ్ ఫోన్ IMEI నంబర్ ఎంటర్ చేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు సింపుల్‌గా తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. తద్వారా.. అది ఒరిజినలో కాదో తెలుసుకోవచ్చు. ఇంతకీ.. ఈ CEIR పోర్టల్ ద్వారా సెకండ్ హ్యాండ్ ఫోన్ వివరాలు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
How to find Second Hand Phone Details through CEIR website :
- మొదట మీరు CEIR అధికారిక వెబ్సైట్ https://www.ceir.gov.in కి వెళ్లాలి.
- ఆ తర్వాత మెయిన్ పేజీలో 'నో యువర్ మొబైల్' (KYM)కు నావిగేట్ చేయండి. అప్పుడు మీకు కనిపిస్తున్న 'వెబ్ పోర్టల్' బటన్‌పై క్లిక్ చేయాలి
- ఆపై మీకు కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు OTP ధ్రువీకరణ ప్రయోజనం కోసం మీ మొబైల్ నంబర్ అడుగుతుంది.
- అప్పుడు అక్కడ వచ్చిన క్యాప్చాను ఎంటర్ చేసి.. మీ మొబైల్ నంబర్ టైప్ చేయాలి.
- ఆ తర్వాత 'get OTP' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చిన OTPని అక్కడ ఇచ్చిన బాక్స్‌లో నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీకు మరో కొత్త బాక్స్ కనిపిస్తుంది.
- దాంట్లో IMEI నంబర్‌ని అడుగుతుంది. అక్కడ IMEI నంబర్‌ను నమోదు చేసి ఆపై Submitపై క్లిక్ చేయాలి.
- అంతే.. ఇక కొత్తగా ఓపెన్ వెబ్‌పేజీలో ఇన్‌పుట్ చేసిన IMEI నంబర్ వివరాలు కనిపిస్తాయి.
Note : మీరు తీసుకున్న మొబైల్ IMEI నెంబర్ తెలియకపోతే.. మొబైల్‌లో *#06# ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్‌పై ఆ నంబర్ కనిపిస్తుంది.
మొబైల్ ఫోన్ పోయిందా? ఆన్లైన్లో సింపుల్ రిక్వెస్ట్‌తో బ్లాక్! సిమ్ మార్చినా నో ఛాన్స్!!
How to check IMEI details using KYM App in Telugu :
KYM యాప్‌ని ఉపయోగించి IMEI వివరాలను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం..
- మీరు మొదట Play Store (Android) లేదా App Store (iOS) నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆపై దాన్ని ఓపెన్ చేయాలి.
- KYM యాప్‌కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కాబట్టి మీరు డౌన్‌లోడ్ చేసిన వెంటనే యాప్ పని చేయడం ప్రారంభిస్తుంది.
- అంతేకాకుండా, సాధారణంగా మొబైల్ బాక్స్‌లో లేదా *#06# డయల్ చేయడం ద్వారా IMEI నంబర్ యొక్క బార్‌కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. అలాగే 15-అంకెల IMEI నంబర్‌ను కూడా మాన్యువల్‌గా టైప్ చేయవచ్చు.
- ఇలా మీ IMEI నంబర్ ఇన్‌పుట్ చేసిన తర్వాత.. వెరిఫై మీద క్లిక్ చేయాలి.
- అప్పుడు ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అది మొబైల్ ఫోన్ సమాచారాన్ని చూపుతుంది.
ఇలా మీరు కొనుగోలు చేసిన సెకండ్ హ్యండ్ ఫోన్ వివరాలు తెలుసుకోవడం వల్ల అది ఒరిజినలా..? కాదా..? అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో దొంగిలించిన ఫోన్లు చాలా మంది అమ్మేసుకుంటారు. కాబట్టి కొనే ముందు ఇలా చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే దొంగిలించబడిన ఫోన్‌పై ఎవరైనా పోలీసు కేసు పెట్టినట్లయితే ఆ ఫోన్ కొన్న తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!
మీకు తెలియకుండానే మీ పేరుతో లోన్ తీసుకున్నారా? మోసగాళ్లకు చెక్ పెట్టండిలా..
How To Track Lost Phone : మీ ఫోన్ పోయిందా?.. క్షణాల్లో కనిపెట్టేయొచ్చు ఇలా!