ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకొచ్చిన నూతన గోప్యతా నిబంధనల అంశంపై కేంద్రం తన వైఖరిని తెలపాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాట్సాప్ కొత్త నిబంధనలు.. భారతీయుల డేటా సంరక్షణకు భంగం కలిగిస్తాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ సూచనలు చేసింది.
ఈ విచారణలో భాగంగా సీజే జస్టిస్ డీఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై మార్చిలోపు తమ వైఖరిని కోర్టుకు తెలపాలని పేర్కొంది.
దీనితో పాటు వాట్సాప్ యూజర్ల తమ డేటాను ఫేస్బుక్ (వాట్సాప్ మాతృసంస్థ)తో పంచుకోవాలా, వద్దా అనేది నిర్ణయించుకునే సదుపాయం కల్పించాలని కూడా కేంద్రం, వాట్సాప్‌కు సూచించింది న్యాయస్థానం.
ఈ అంశంపై ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించారు అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ. ఈ విషయంపై ఇప్పటికే ఏకసభ్య ధర్మానసం ముందు కేసు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. నూతన గోప్యతా విధానాలపై వాట్సాప్‌ను అదనపు సమాచారం కోరినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:వాట్సాప్‌కు కేంద్రం 'వార్నింగ్ లెటర్'!