మన ఫోన్ చిత్రాలు, వీడియోలు, డాకుమెంట్లతో నిండిపోయినా.. వాటిని మళ్లీ బ్యాకప్ చేసుకోవాలన్నా.. ఏం చేస్తాం.. వాటిని మన కంప్యూటర్లోకి, పెన్ డ్రైవ్, హార్డ్‌డిస్క్‌లోకి పంపిస్తాం. ఇవేవీ అందుబాటులో లేని వారు క్లౌడ్ స్టోరేజీ యాప్స్‌ను ఉపయోగిస్తారు. గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్ ప్రజాదరణ పొందినవి. కానీ, చాలా మందికి తెలియని, వాటికి పోటీనిచ్చే టాప్ 5 క్లౌడ్ స్టోరేజీ టూల్స్ ఇవీ..!
1. మెగా :
ఇది వినియోగదారుల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే క్లౌడ్ బ్యాకప్ సర్వీసు. ఇది సింపుల్ ఇంటర్ ఫేస్‌ను కలిగి ఉండి ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. అంతేకాకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ఇందులో 20 జీబీ వరకు ఫైల్స్ నిల్వ చేసుకునే అవకాశముంది. ఖాతా ఓపెన్ చేసి ఫైల్స్ అప్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో డేటా షేర్ చేసుకునేందుకు వీలుగా లింకులు క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్స్‌ను టైమ్‌లైన్ ఫార్మాట్లో చూడొచ్చు. ఇంకా స్టోరేజీ సామర్థ్యం కావాలంటే నగదు చెల్లింపు చేసి కొనుగోలు చేసుకోవచ్చు.
2. రెసిలియో సింక్ :
వివిధ రకాల పరికరాలకు ఫైల్స్, ఫొటోలు, ఇతర సమాచారాన్ని షేర్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులోని సింక్ హోమ్ అనే ఫీచర్‌తో.. డెస్క్‌టాప్, ఫోన్, క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకోవడానికి ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫైళ్లను సులభంగా ట్రాన్స్ఫర్ చేయడానికి బిట్ టొరెంట్ పీర్ టు పీర్ అనే ఎన్క్రిప్షన్ ఉంటుంది. యాడ్ కెమెరా బ్యాకప్ అనే ఫీచర్ ద్వారా గ్యాలరీలోని చిత్రాలు, వీడియోలు ఎప్పటికప్పుడు సింక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ డివైజ్‌లకు బ్యాకప్ చేసుకోవచ్చు. దీన్ని పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చు.
3. బాక్స్ :
మంచి ఫీచర్లతో ఉన్న క్లౌడ్ స్టోరేజీ యాప్స్‌లో ఇదొకటి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేసి ఫైల్స్ అప్లోడ్ చేయాలి. వీటిని లింక్‌లు క్రియేట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఇందులోని బాక్స్ నోట్ ఫీచర్ ద్వారా నోట్స్ రాసుకోవచ్చు. వ్యక్తిగత వినియోగదారుల కోసం 25 జీబీ స్టోరేజీ వరకు ఉచితంగా వాడుకోవచ్చు. ఇంకా ఎక్కవ కావాలంటే ప్లాన్లను అప్‌డేట్ చేసుకోవచ్చు.
4. నార్డ్ లాకర్ :
డిజైన్, పని తీరు, భద్రత పరంగా ఈ యాప్ బాగుటుంది. దీనిలో ఉన్న సులభమైన ఫీచర్ల ద్వారా ఫైళ్లను ఇతరులతో పంచుకోవచ్చు. క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్, అధునాతన సాంకేతికత, ఇతర భద్రతా ప్రమాణాల వల్ల సమాచారం సురక్షితంగా ఉంటుంది. ఇందులో సైన్అప్ అయి.. సేవల్ని వినియోగించుకోవచ్చు. 3 జీబీ వరకు స్టోరేజీని ఉచితంగా వాడుకోవచ్చు. మొత్తమ్మీద ఈ యాప్ కార్పొరేషన్లు, ఏజెన్సీలకు బాగా ఉపయోగపడుతుంది.
5. సింక్ డాట్ కమ్ :
ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. మీ ఫైళ్లన్నింటినీ ఒకే దగ్గరకు తీసుకురాడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ డివైజ్‌లలో ఉచితంగా వాడుకోవచ్చు. మన సమాచారాన్ని లింకుల రూపంలో క్రియేట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. అన్ని రకాల ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తుంది.
ఆయా బ్యాకప్ టూల్స్ నిల్వ సామర్థ్యం, భద్రత, గోప్యత, సులభతర వాడకం, ధర వంటి అంశాల ఆధారంగా, అవి మీకు అందించే ఫీచర్లు, ప్రయోజనాలు, అవసరాన్ని బట్టి మీకు ఏ క్లౌడ్ బ్యాకప్ ప్రొవైడర్ సరైనదో ఎంచుకోండి.