Dheera Food Delivery Robot :భాగ్యనగరంలో కొత్తగా ఫుడ్ డెలివరీ రోబోలు రాబోతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్టుమెంట్లలో తమ సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. డెలివరీ బాయ్స్ స్థానంలో నేరుగా మన గుమ్మం వద్దకే ఫుడ్ పార్సిల్‌ను తీసుకువచ్చి అందించనున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో చూడముచ్చటగా తయారు చేసిన ఈ రోబోలకు ధీరా అనే నామకరణం చేశారు.
దేశంలోనే మొదటిసారిగా ధీరా రోబోలు నగరవాసులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్విగ్గీ, జోమాటో ఇలా ఆయా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు సంబంధించిన బాయ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ లోపలికి వచ్చే అవసరం లేకుండా వారు తీసుకువచ్చే ప్యాకెట్లను ప్రధాన గేటు వద్ద ఉండే ధీరాకు ఇచ్చి వెళ్తేచాలు. సదరు ప్యాకెట్లను సూచించిన ఫ్లాట్ లేదా విల్లాకు తెచ్చి ఇవ్వడం ధీరా ప్రత్యేకత. మాదాపూర్‌లోని ఎక్స్‌ప్రెస్ టెక్నో లాజిస్టిక్స్ అనే అంకుర సంస్థ ధీరా రోబోలను ప్రవేశపెడుతోంది.
మొదటి దశలో రెండు.. 'మొదటి దశలో రెండు రోబోలు నార్సింగి ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28న వీటిని ప్రవేశపెట్టే యోచన చేస్తున్నాం. త్వరలోనే మరిన్ని డెలివరీ రోబోలను తీసుకువచ్చే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.' -- శ్రీనివాస్ మాధవం సంస్థ సీఈవో
ఒక్కసారి 16 ప్యాకెట్లు.. ధీరా రోబోకు ఒక్కసారి 16 పార్సిల్ ప్యాకెట్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. డెలివరీ బాయ్ తాను తీసుకువచ్చిన ప్యాకెట్లను రోబోలో ఉన్న బాక్స్‌ల్లో ఉంచి సంబంధిత ఫ్లాట్ నంబర్లు లేదా విల్లా నంబర్‌ను రోబోకు ఉన్న కీ ప్యాడ్ పై నొక్కితే చాలు. వెంటనే ఆ రోబో వాటిని సూచించిన ఫ్లాట్ వద్దకు తీసుకెళ్తుంది. ఇంటి గుమ్మం వద్ద రోబో రాగానే మన సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. సదరు ఓటీపీ నొక్కగానే రోబో పార్సిల్ ఇచ్చి వెళ్తుంది.
బహుళ అంతస్తు అపార్టుమెంట్లలో సైతం ఇలాంటి సేవలు వినియోగించుకునేలా వీటిని తయారు చేశారు. ఎలివేటర్‌లో ఉండే చిప్ సహాయంతో రోబో సూచించిన అంతస్తుకు వెళ్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ రకపు రోబోల వినియోగం వల్ల డెలివరీ ఛార్జీలు తగ్గుతాయి. బయట వ్యక్తులు, డెలివరీ బాయ్స్ లోపలికి వచ్చే అవకాశం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు.