సమాచార గోప్యత (డేటా ప్రైవసీ) గురించి ఇటీవలి కాలంలో తీవ్రంగా చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాలు వినియోదారుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని తమ వ్యాపార అవసరాల కోసం ఉపయోగిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడం వల్ల డేటా భద్రతపై పలువురు యూజర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ డేటా ప్రైవసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దపు రెండు అతి ముఖ్యమైన అంశాల్లో డేటా ప్రైవసీ ఒకటని అన్నారు. అలానే వాతావరణ మార్పులు కూడా అత్యంత కీలకమన్నారు. ఫాస్ట్ కంపెనీ అనే మ్యాగజైన్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై నమ్మకముంది కానీ..
ప్రస్తుత పరిస్థితుల్లో డేటా ప్రైవసీని మరింత మెరుగ్గా తర్వాతి తరానికి ఏ విధంగా అందివ్వగలమనే దానిపై దృష్టి సారించాలన్నారు టిమ్. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'నాకు ఎన్‌క్రిప్షన్‌పై ఎంతో నమ్మకం ఉంది. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు ఎలాంటి దొంగదార్లు లేవు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది బలహీనపడుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది' అని అన్నారు.
డేటా ప్రైవసీ, డేటా కలెక్షన్‌లో నైతిక విలువలు పాటిస్తున్నట్లుగానే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా నైతికత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల సమాచార గోప్యతపై యూజర్స్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో టిమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
యాపిల్ కొత్త ఫీచర్..
త్వరలో యాపిల్ కూడా సమాచార గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా యాప్ స్టోర్‌లోని థర్డ్ పార్టీ యాప్స్ ఇక మీదట యూజర్ డేటాను ట్రాక్ చేయాలంటే అనుమతి తప్పనిసరి. దీంతో యాపిల్ నిర్ణయంపై పలు టెక్ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ యాపిల్ మాత్రం యూజర్ డేటా ప్రైవసీ భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:సొంత క్రిప్టో కరెన్సీపై ఆర్థిక శాఖ స్పష్టత