తమిళనాడుకు చెందిన ఓ మహిళ గత పది నెలల్లో 55 లీటర్ల చనుబాలను సేకరించి, అనంతరం దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు ఆసియా అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించారు. కోయంబత్తూరు జిల్లా కారుమతంబట్టి సమీపంలోని కన్యూర్ ప్రాంతానికి చెందిన సింధు మోనిక.
సింధుకు, ప్రొఫెసర్ మహేశ్వర్ అనే వ్యక్తికి.. ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి వెంబా అనే ఏడాదిన్నర కుమార్తె ఉంది. చనుబాలు దానం చేయడం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా సింధు మోనిక తెలుసుకున్నారు. తను కూడా ఇదే విధంగా దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుపూర్ జిల్లా అవినాసి ప్రాంతంలో తల్లి పాల నిల్వ కోసం పనిచేస్తున్న 'అమృతం థాయ్ పల్ దానం' అనే సంస్థను సంప్రదించారు. తల్లి పాలను ఎలా నిల్వ చేయాలి, ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి అనే దానిపై సంస్థకు చెందిన రూపా అనే ప్రతినిధి మోనికకు వివరించారు. ఈ నిబంధనలను పాటించిన సింధు మోనిక గత 10 నెలల్లో 55 లీటర్ల పాలను సేకరించి కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు మంగళవారం ధ్రువపత్రాన్ని అందించారు.
![Breast milk donation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-cbe-01-breast-milk-special-story-visu-7208104_07112022140812_0711f_1667810292_781_0811newsroom_1667919066_206.jpg)
![Breast milk donation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16875338_milk.jpg)
'ప్రతి బిడ్డకు తల్లి పాలు చాలా అవసరం.. చాలా మంది చిన్నారులు చనుబాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.. సామాజిక మాధ్యమాల్లో దీని గురించి తెలియగానే నేను కూడా దానం చేయాలని అనుకున్నాను' అని సింధు మోనిక తెలిపారు. గతేడాది తమ సంస్థ నుంచి 1,143 లీటర్ల రొమ్ము పాలను సేకరించగా.. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 1,500 లీటర్లు సేకరించి దానం చేసినట్లు 'అమృతం థాయ్ పల్ దానం' సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
![..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-cbe-01-breast-milk-special-story-visu-7208104_07112022140812_0711f_1667810292_527_0811newsroom_1667919066_1019.jpg)