సిగరెట్ ఉండేది నాలుగించులే... నాశనం చేస్తున్న కుటుంబాలు లక్షలు.
సిగరెట్ తాగేవాడు చచ్చినా మానడని మనం రోజు అంటూ ఉంటాం..
సినిమా థియేటర్లలో ప్రభుత్వం పొగాకు, ధూమపానంపై
రాహుల్ ద్రవిడ్ ప్రకటనలు ఎన్నిసార్లు చూపించినా... సరదాగా నవ్వుకుంటామే తప్ప పర్యవసనాలు పట్టించుకోం...
ధూమపానంపై యుద్ధానికి సిద్ధమైంది 31 ఏళ్ల ఓ అమ్మాయి. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతున్న పొగాకుకు చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది.
ఆమే! అక్షయ షణ్ముగం
అక్షయ మెకానికల్ ఇంజినీర్. మసాచూసెట్స్ నుంచి పీహెడీ పూర్తి చేసింది. 2015లో మిత్రులతో కలిసి లుమ్మి లాబ్స్ సంస్థ ఆరంభించింది.
2018లో ఫోర్బ్స్ ఆరోగ్యరంగంలో విడుదల చేసిన ప్రపంచంలో 30 ఏళ్ల లోపు వారి జాబితాలో చోటు సంపాదించుకుంది అక్షయ షణ్ముగం. |
సిగరెట్ మానేయాలని అక్షయ స్నేహితులు చాలా మంది అనుకున్నారు. వారం, పదిరోజులు...అంతే. మళ్లీ సిగిరెట్ వెలిగించేవారు. నిర్ణయం తీసుకుంటే ధూమపానాన్ని ఆపలేమా? దీనిపై పరిశోధనలు ప్రారంభించి ఓ సాప్ట్‌వేర్ తయారు చేసింది. దీనితో పొగ తాగడం ఎలా మాన్పించొచ్చు అనేదేగా మీ సందేహం? సమాధానమే సెన్సింగ్ స్మార్ట్ వాచ్ కాన్సెప్ట్..
ఇంతకీ ఇది ఎలా పని చేస్తుంది..?
సిగరెట్ తాగడం మానేయాలని నిర్ణయించుకున్నప్పడు మనం పెట్టుకునే ఈ స్మార్ట్ వాచ్ మన చేతి ప్రవర్తనను గమనిస్తుంది. చేయి ఏ వైపు తిప్పుతున్నారు? ఎంత సేపు తిప్పుతున్నారు? ఎక్కడ సిగరెట్ తాగుతున్నారో లొకేషన్‌తో సహా అంతా నోటిఫై చేస్తుంది. ఇవన్ని గమనించి విశ్లేషిస్తుంది. మళ్లీ సిగరెట్ తాగాలనుకుని అటువైపు అడుగులు వేస్తే వెంటనే గుర్తిస్తుంది. సిగరెట్ తాగబోయే ఆరు నిమిషాల ముందే ఫోన్‌కు నోటిఫికేషన్లు పంపిస్తుంది. అంతేకాదు సిగరెట్లు మానడం వల్ల ఎంత డబ్బు ఆదా చేసామో కూడా చెబుతుంది. మన ఆరోగ్యం పట్ల... మనకన్నా ఎక్కువ శ్రద్ధ ఈ యాప్ తీసుకుంటుంది.
యూమాస్, యేల్ శాస్త్రవేత్తలతో కలిసి అక్షయా షణ్ముగం లుమ్మి లాబ్స్‌ను 2015 నవంబర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమే సీఈవో. ఈ సంస్థకు నేషనల్ ఇనిస్టిట్ట్యూట్ ఆఫ్ హెల్త్ ఆర్థిక సహకారం అందిస్తోంది.
భారత్‌లో పొగ తాగే వారిలో దాదాపు 50 శాతం మంది మానేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మానలేకపోతున్నట్లు అధ్యయనంలో తేలింది. వారందరిచే మాన్పించడమే తన ధ్యేయం అంటోంది అక్షయ. సిగరెట్‌కు బానిసైన కార్పొరేట్ ఉద్యోగులు ఈ స్మార్ట్ వాచ్ ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అక్షయ కోరుతోంది.
ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించడం పట్ల ఆనందంగా ఉందన్న అక్షయ... ఈ డిజిటల్ సహకారంతోనైనా సిగరెట్‌ను నిర్మూలించడంలో సఫలీకృతం కావాలని కోరుకుంటోంది.