ఆండ్రాయిడ్ వెర్షన్ 12... ఇప్పుడు టెక్ వర్గాల్లో ఎక్కువగా చర్చ నడుస్తోంది ఈ అంశంపైనే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫీచర్లు ఈ వెర్షన్‌లో వచ్చేనా? అని యూజర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో... విడుదలైన 3 బీటా వెర్షన్ల ఆధారంగా...టెక్ నిపుణులు వెల్లడిస్తున్న సంగతులు ఆండ్రాయిడ్ వినియోగదారుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
స్ప్లిట్ స్క్రీన్
ఒకేసారి 2యాప్స్ చూసుకునేందుకు గతంలోనే ఆండ్రాయిడ్ స్ప్లిట్ స్క్రీన్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఏదైనా యాప్ వాడుతున్నప్పుడు స్ప్లిట్ స్క్రీన్ ఎంచుకుంటే.. స్క్రీన్ పై భాగంలో ఆ యాప్ వచ్చి చేరుతుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన మరో యాప్‌ను ఎంచుకుంటే, అది దాని కింద వచ్చి చేరుతుంది. అయితే దిగువ ఉన్న యాప్ స్క్రీన్... పై భాగంలోకి వెళ్లాలంటే కుదరదు. కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్‌లో ఈ ఆప్షన్ ఇస్తున్నారు. 2 యాప్‌లను విడదీస్తూ మధ్యలో ఉండే గీత మీద డబుల్ ట్యాప్ చేస్తే వాటి స్థానాలు మారుతాయి.
యాప్ విడ్జెట్స్
ప్రస్తుతం ఏ చిన్న పనికైనా యాప్ ఉపయోగిస్తున్నాం. తద్వారా.. ఫోన్‌లో చాలా యాప్‌లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో అన్నింటిని మోనూ లిస్ట్‌లో వెతుక్కోవడం కష్టం. అందుకే షార్ట్‌కట్ కోసం ఆయా యాప్స్ విడ్జెట్స్ తయారు చేస్తుంటాయి. ఆండ్రాయిడ్‌లో ఇలాంటి విడ్జెట్స్ చాలానే ఉంటాయి. అందులో నుంచి కావాల్సిన విడ్జెట్ వెతుక్కోవడం కష్టమే. అందుకే విడ్జెట్స్ సెక్షన్‌లో సెర్చ్ ఆప్షన్ ఇస్తున్నారు. కావాల్సిన యాప్ పేరు టైప్ చేస్తే చాలు... విడ్జెట్‌ను సులభంగా వెతుక్కోవచ్చు.
ఓకే గూగుల్
స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ యాక్టివ్ చేయడానికి కొత్త సదుపాయం రాబోతోంది. చాలా మెుబైళ్లలో హే గూగుల్, ఓకే గూగుల్ అని చెబితే అసిస్టెంట్ యాక్టివ్ అవుతుంది. పిక్సల్ ఫోన్స్‌లో షేక్ చేయడం, బ్యాక్ ట్యాప్ చేయడం వంటి వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా పవర్ బటన్ ఆప్షన్ తీసుకురానున్నారు. పవర్ బటన్‌ను కాసేపు లాంగ్‌ప్రెస్ చేస్తే చాలు.. గూగుల్ అసిస్టెంట్ యాక్టివ్ అవుతుందట.
ఎక్స్‌పాండ్ స్కీన్‌షాట్
ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్‌షాట్ తీసుకోవడం చాలా సులభం. అయితే ఆ స్క్రీన్ షాట్‌ను విస్తరించడం కుదరదు. అంటే ఏదైనా వార్త మొత్తం స్క్రీన్‌షాట్ తీసుకుందాం అంటే అవ్వదు. సగం, సగం కట్ చేసుకోవాలి. అయితే క్యూరేటెడ్ ఓఎస్‌లు ఉండే మొబైల్స్‌లో ఈ ఆప్షన్ ఉంది. స్క్రీన్ షాట్ కొట్టాక... ఎక్స్‌పాండ్ బటన్ నొక్కితే ఎంతవరకు కావాలంటే అంతవరకు స్క్రీన్ షాట్ విస్తరించుకోవచ్చు. ఇప్పుడు ఈ సదుపాయం గూగుల్ ఓఎస్‌లో ఉండబోతోంది. స్క్రీన్ షాట్ కొట్టాక ‘క్యాప్చర్ మోర్’ క్లిక్ చేసి ఎక్స్‌పాండ్ చేయొచ్చు.
డ్యూయల్ ప్యానల్
మొబైల్ స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి... హోం స్క్రీన్ మీద యాప్స్ పెట్టుకుంటే అన్నీ దగ్గరగా ఉంటాయి. అవసరమైనప్పుడు సులభంగా కావాల్సిన యాప్‌ను వేలితో టచ్ చేయొచ్చు. అదే ట్యాబ్స్‌లో అయితే అంత సులభంగా ఉండదు. పెద్ద స్క్రీన్ వల్ల యాప్స్ సులభంగా ఒక చేత్తో టచ్ చేయలేం. అందుకే ట్యాబ్స్ కోసం డ్యూయల్ ప్యానల్ తీసుకువస్తున్నారు.
ట్రాష్‌బిన్
మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్ తక్కువ ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ల కోసం ఎక్స్‌ట్రా డిమ్ ఆప్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ డిమ్ చేస్తే... తగ్గే బ్రైట్‌నెస్ కంటే ఇది చాలా తక్కువట. రాత్రి వేళల్లో మొబైల్ వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. ఎమోజీ 13.1 ప్యాక్‌ను ఇందులో పొందుపరుస్తున్నారు. గతంలో ఉన్న ఎమోజీలకు ఇవి భిన్నంగా ఉండనున్నాయి. అలాగే, మెుబైల్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రాష్‌బిన్ సౌకర్యం కూడా ఈ వెర్షన్‌లో వచ్చే అవకాశముందని టెక్ వర్గాల అంచనా.
త్వరలోనే..
ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూ దశలో ఉంది. బీటా వెర్షన్ టెస్ట్ జులై ఆఖరి వరకు ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే బగ్స్ సరి చేసి, ఆగస్టు తర్వాత అందరికీ అందుబాటులోకి తెస్తారు. మెుదటగా పిక్సల్ మెుబైళ్లలో....తర్వాత ఏయే మెుబైళ్లకి ఎప్పుడు వస్తుందో... గూగుల్ త్వరలోనే ప్రకటించనుంది.
- ఇదీ చదవండి : గూగుల్ వెతుకులాటలో కొత్తగా.. మీ కోసమే!