పబ్‌జీ ప్రియులకు శుభవార్త.. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న గేమ్ విడుదలకు మార్గం సుగమమయింది. తాజాగా పబ్‌జీ కార్పొరేషన్‌కు చెందిన పబ్‌జీ, పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ ఇండియా, పబ్‌జీ మొబైల్ లైట్ పేర్లను కంపెనీ సబ్సిడరీ కంపెనీలుగా కార్పొరేట్ మంత్రిత్వశాఖ వద్ద రిజిష్టర్ చేసింది. దీంతో వీలైనంత త్వరలో ఈ గేమ్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే ఈ గేమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఐఓఎస్ యూజర్స్ కోసం విడుదల చేస్తారట. బెంగళూరు కేంద్రంగా పబ్‌జీ కొత్త కంపెనీ పనిచేస్తుందని పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది.
అంతకముందు పబ్‌జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ సరికొత్త లుక్‌తో పబ్‌జీ మొబైల్ ఇండియా పేరుతో గేమ్‌ను భారత్‌లో తిరిగి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే భారత మార్కెట్లో వీడియో గేమ్, ఈ-స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ రంగాల్లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది.
పబ్‌జీ గేమ్‌కు భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఎంతో మంది అభిమానులున్నారు. కొద్ది నెలల క్రితం భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 117 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో క్రాఫ్టన్ సంస్థ చైనాకు చెందిన టెన్సెంట్‌తో ఒప్పందం రద్దు చేసుకుంది. తాజాగా యూజర్ డేటా భద్రతకు సంబంధించి మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్‌తో ఒప్పందం చేసుకుని ఈ గేమ్‌ను కొత్త లుక్‌తో భారత్‌లో విడుదల చేయనుంది.
ఇదీ చూడండి: భారత్ చేతికి 'ప్రిడేటర్' డ్రోన్లు- చైనాతో సై!