ఇటీవలి కాలంలో డిజిటల్ పేమెంట్లకు ఆదరణ బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ వినియోగించడం, షాపింగ్ వంటి వాటికి డెబిట్/క్రిడిట్ కార్డులను వాడటం సర్వసాధారణంగా మారిపోయింది. నగదు రూపంలో జరిపే చెల్లింపులతో పోలిస్తే.. వీటి ద్వారా అనేక సౌలభ్యాలు ఉన్నాయి. అయితే ఇందులో రిస్క్ ఉందనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి.
పెరిగిన డిజిటల్ పేమెంట్లను అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దీని వల్ల చాలా మందికి డిజిటల్ పేమెంట్ల విషయంలో సెక్యూరిటీ సంబంధిత భయాలు పెరిగిపోయాయి. మరి డిజిటల్ పేమెంట్ల విషయంలో భద్రతకు భరోసానిచ్చే 5 సేఫ్టీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుర్తింపు పొందిన యాప్‌లను మాత్రమే వాడండి..
యాప్ స్టోర్, ప్లే స్టోర్ వంటి వాటిలోనూ చట్టవిరుద్ధమైన యాప్‌లు ఉండే అవకాశం ఉంది. అందువల్ల సమీక్షకులు ఇచ్చే రివ్యూలను పరిశీలించండి. తక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్‌లు ఉన్న యాప్‌ల జోలికి వెళ్లకండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉందని నిర్దరించుకున్న తరువాత మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసేటప్పుడు.. అది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌లో ధ్రువీకరించారో, లేదో చూసుకోండి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్‌లకు కూడా చట్టబద్ధత ఉండాలి.
యాప్‌లను ఇన్స్టాల్ చేసేప్పుడు కెమెరా, ఫోన్ బుక్, ఎస్ఎంఎస్ యాక్సెస్ అవసరమైతే తప్ప ఇవ్వొద్దని నిపుణులు చెబుతున్నారు. యాప్ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే.. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ సహా ఇతర సున్నితమైన వివరాలను యాప్‌లో ఎంటర్ చేయాలని సలహా ఇస్తున్నారు.
2. బలమైన పాస్వర్డ్
డిజిటల్‌గా పేమెంట్లు చేయడంలో పాస్వర్డ్లు చాలా కీలకం. అయితే చాలా మంది గుర్తుంచుకునే సౌలభ్యం కోసం.. సులభమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకుంటారు. అయితే అలాంటి పొరపాటు చేయొద్దని చెబుతున్నారు సైబర్ నిపుణులు. పాస్‌వర్డ్‌లలో పేర్లను, పుట్టిన తేదీ వంటి వాటిని పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.
నంబర్లు, అక్షరాలతో కలిపి వ్యక్తిగత వివరాలకు సంబంధం లేని పాస్‌వర్డ్‌ను పేమెంట్ యాప్‌లకు పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కనీసం నెల రోజులకు ఓ సారి పాస్వర్డ్ మారుస్తూ ఉండాలని సూచిస్తున్నారు. దీని ద్వారా ఇతరులు పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయలేరని అంటున్నారు.
3.పేమెంట్ల కోసం పబ్లిక్ వైఫై వాడొద్దు..
చాలా మంది ఉచితంగా వస్తుందని పబ్లిక్ వైఫైని విపరీతంగా వాడుతుంటారు. బ్రౌజింగ్ కోసమైతే సమస్య లేదు కానీ పేమెంట్లు చేసేందుకు మాత్రం పబ్లిక్ వైఫై వాడొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాంటి నెట్‌వర్క్‌ల ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ కంప్యూటర్ లేదా వైఫై ద్వారా చెల్లింపులు చేయాల్సి వస్తే.. పని పూర్తయ్యాక బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయాలి. ఆ తర్వాత సురక్షిత నెట్వర్క్ ద్వారా పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి.
పేమెంట్ల కోసం.. హెచ్టీటీపీఎస్తో ఉన్న లింక్‌లను మాత్రమే వాడాలని, హెచ్‌టీటీపీ యూఆర్ఎల్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.
4. టూ స్టెప్ వెరిఫికేషన్
రెండంచెల ధ్రువీకకరణ అనేది పాస్వర్డ్ తస్కరణకు గురైనా.. పేమెంట్ల విషయంలో అదనపు భద్రతనిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా మీ పేమెంట్ యాప్ పాస్‌వర్డ్‌ను తస్కరించి పేమెంట్ చేయాలనుకున్నా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరిస్తేనే పేమెంట్ పూర్తవుతుంది. అందుకే వీలైనంత వరకు రెండంచెల ధ్రువీకరణ ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.
5.క్యూఆర్ కోడ్లతో జాగ్రత్త..
డిజిటల్ పేమెంట్ల కోసం ఇటీవల క్యూఆర్ కోడ్ల వినియోగం పెరిగింది. ప్రతి సారి పేమెంట్ చేసేటప్పుడు మొబైల్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. అయితే.. ఆ క్యూఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నమ్మదగిన పేమెంట్ యాప్‌లకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మాత్రమే స్కాన్ చేయాలి. క్యూఆర్ కోడ్‌పై అనుమానం ఉంటే.. నేరుగా మొబైల్ నంబర్ ద్వారానే పేమెంట్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.
ఇవీ చదవండి: