Wheat Rava Kichidi Made With Ghee : మనలో చాలా మందికి కిచిడీ అనగానే బియ్యంలో కందిపప్పు లేదా పెసరపప్పుతో చేసిన వంటకాలే ఎక్కువగా కళ్ల ముందు మెదులుతుంటాయి. ఈ పప్పు ధాన్యాల కిచిడీ చేయాలంటే కనీసం అరగంట వరకు సమయం పడుతుంది. కానీ పిల్లల లంచ్ బాక్స్‌లోకి లేదా ఆఫీస్‌కు వెళ్లే శ్రీవారి కోసం ఉదయాన్నే కిచిడీ చేయాలంటే అందరికీ, అన్ని వేళల్లో వీలు కాకపోవచ్చు. ఇలాంటి వారి కోసం సింపుల్ కిచిడీ రెసిపీ ఒకటి ఉంది, అదే గోధుమ రవ్వ నెయ్యి కిచిడీ. ఎంతో రుచికరంగా ఉండి చిన్నపిల్లల దగ్గరి నుంచి, పెద్దల వరకు అందరూ ఇష్టపడి తినే నేతి రవ్వ కిచిడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గోధుమ రవ్వ నేతి కిచిడీకి కావాల్సిన పదార్థాలు...
- ఒక గ్లాసు గోధుమ రవ్వ
- ఉప్పు సరిపడినంత
- టీ స్పూన్ జీలకర్ర
- టీ స్పూన్ ఆవాలు
- తరిగిన అల్లం ముక్కలు
- రెండు ఎండు మిర్చి
- కొద్దిగా జీడిపప్పు,
- కప్పు పచ్చి బఠాణీలు
- రెండు క్యారెట్‌లు
- తరిగిన బీన్స్ ముక్కలు కప్పు
- ఒక బంగాళదుంప
- రెండు టొమాటోలు
- టేబుల్ స్పూన్ మిరియాలు
- రెండు టేబుల్ స్పూన్‌ల పెసర పప్పు
- రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యి
గోధుమ రవ్వ నేతి కిచిడీని తయారు చేయు విధానం..
- ముందుగా స్టావ్‌ను వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి.
- కడాయి వేడైన తరవాత అందులోకి రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యిని వేసుకుని ఒక గ్లాసు గోధుమ రవ్వను వేయించి పక్కన పెట్టుకోవాలి.
- తరవాత మళ్లీ అదే పాత్రలోకి రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యిని వేసుకోవాలి.
- అందులోకి కచ్చాపచ్చాగా నూరిన టేబుల్ స్పూన్ మిరియాలు, రెండు టేబుల్ స్పూన్‌ల పెసర పప్పు, జీలకర్ర వేసుకోవాలి.
- ఇవి కొద్దిగా వేగిన తరవాత తరిగిన అల్లం ముక్కలు, రెండు ఎండు మిర్చి, జీడిపప్పు, కొద్దిగా పసుపు, పచ్చి బఠాణీలు వేయాలి.
- తరవాత మిశ్రమంలోకి క్యారెట్, బీన్స్, బంగాళదుంప, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పును వేసుకోండి.
- తరవాత కడాయిలోకి కొన్ని నీళ్లను పోసి, కొంచెం మగ్గనివ్వాలి. రవ్వకు సరిపడా నీళ్లు ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలి.
- నీళ్లు మరిగిన తరవాత అందులోకి వేయించిన రవ్వను కొద్ది కొద్దిగా ఉండలు కట్టకుండా కలియ తిప్పాలి. ఇలా చేసి సన్నని మంటను మీద రవ్వను ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి.
- తరవాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీరు వేసుకొని స్టావ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే వేడి వేడిగా నేతి ఘుమాయింపుతో వహ్వా అనిపించే రవ్వ కిచిడీ రెడీ.
- ఇందులోకి పల్లీలు లేదా కొబ్బరితో చేసిన పచ్చడితో తింటే మరింత టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే మీరు కూడా ఓసారి ట్రై చేయాండి మరి.
ఈ కేక్స్‌తో క్రిస్మస్ వెరీ వెరీ స్పెషల్ - తిన్నారంటే వావ్ అనాల్సిందే!